Share News

అయ్యో.. రామచంద్రా..!

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:32 AM

భద్రాద్రిలో కొలువై ఉన్నది దశరథ తనయుడైన శ్రీరామచంద్రుడా? లేక వైకుంఠం నుంచి నేరుగా దిగివచ్చిన వైకుంఠ రామనారాయణుడా...

అయ్యో.. రామచంద్రా..!

  • సీతారాముల గోత్రం, ప్రవర మార్చేశారు!

  • దశరథరాముణ్ని రామనారాయణుడు అంటున్నారు!

  • భద్రాచలం రాములోరిపై తెగని పంచాయితీ

  • ఈ వివాదంపై 2022లో హైకోర్టులో పిటిషన్‌

  • ఐదుగురు పండితులతో కమిటీ వేసిన కోర్టు

  • 2024లో దేవాదాయ శాఖకు నివేదిక సమర్పణ

  • ఇప్పటికీ కోర్టుకు సమర్పించకపోవడంపై ధిక్కరణ పిటిషన్‌.. కమిషనర్‌కు నోటీసులు

  • ఈ నెల 23న హైకోర్టులో విచారణ

  • ఈసారైనా ‘సీతారాముల కల్యాణం’ జరిపించాలి

  • వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రిలో కొలువై ఉన్నది దశరథ తనయుడైన శ్రీరామచంద్రుడా? లేక వైకుంఠం నుంచి నేరుగా దిగివచ్చిన వైకుంఠ రామనారాయణుడా? అన్న వివాదం ఎప్పుడు తేలుతుందా అని భక్తులు నిరీక్షిస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టు ఐదుగురు పండితులతో వేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. అది హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ కేసు విచారణ ఈ నెల 23న జరగనుండడంతోపాటు 27న భద్రాద్రి రామయ్య కల్యాణం ఉన్న నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2012 వరకు భద్రాచలంలో ఉన్నది దశరథ తనయుడు శ్రీరామచంద్రుడుగానే అన్ని కార్యక్రమాలు నడిచాయి. శ్రీరాముని గోత్రం వశిష్ట. సీతా దేవిది గౌతమస గోత్రం. కానీ, 2012 నుంచి అక్కడ ఉన్నది దశరథ పుత్రుడు కాదని.. ఆయన రామనారాయణుడని అంటూ గోత్రం, ప్రవరలను మార్చి చదువుతున్నారు. రాముడి గోత్రంగా నారాయణుడి గోత్రమైన అచ్యుత గోత్రాన్ని.. ప్రవరగా ఆదినారాయణాయ, నిరాకార, సాకార అంటూ ఆది దేవుడి పేరిట చెబుతున్నారు. సీతాదేవి గోత్రం కూడా లక్ష్మీదేవి గోత్రమైన సౌభాగ్య అని చదువుతున్నారు. ప్రవర కూడా లక్ష్మీదేవి ప్రవరే. సరిగ్గా ఇక్కడే పండిత వర్గం రెండుగా విడిపోయింది. అన్నదానం చిదంబర శాస్త్రి ఏకంగా ఒక గ్రంథం రాశారు. భద్రాద్రిలో సీతారామ కల్యాణం జరగకపోవడం బాధాకరమనీ పేర్కొన్నారు. ఆయన తాను రాసిన పుస్తకాన్ని అనేకమంది పండితులకు కూడా పంపించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, రేజేటి వేంకట వేణుగోపాలాచార్యులు, బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ, బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి, వేదాల వేంకట సీతారామాచార్యులుతోపాటు చాలా మంది భద్రాద్రిలో ఉన్నది దశరథ పుత్రుడు రాముడే అని పేర్కొన్నారు.


అర్చకుల వాదన ఇలా..

రాముడు భద్రుడికి దర్శనమిచ్చినప్పుడు నాలుగు చేతులతో శంఖచక్రాలతో సీతామాతను తొడపై కూర్చోబెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆయన రామనారాయణుడని, దశరథ తనయుడు కాడని కొందరు పండితులు, కొందరు ఆలయ అర్చకులు వాదిస్తున్నారు. ఆయనకు తల్లి, తండ్రీ ఆయనే అంటూ ‘విభవ వాసుదేవ శర్మ పుత్రాయ’ అని చెబుతున్నారు. కల్యాణ ప్రక్రియలో గత 14 ఏళ్లుగా రామనారాయణ వరాయః అని, అమ్మవారు జనకుని కూతురు కాదంటూ క్షీరార్ణవ శర్మ పుత్రీం సీతామహాలక్ష్మీం అనీ చెబుతున్నారు. శుభలేఖ మీద సీతారామ కల్యాణమని ఉంటుంది, కానీ వివాహ ప్రక్రియలో ఎక్కడా దశరథుడి పేరు, జనకుడి పేరు వాడడం లేదు.

మూడు తాళిబొట్లు చేయించిన రామదాసు..

పోకల దమ్మక్క నిర్మించిన తాటాకు పాకలో రామదాసు మొదటిసారి స్వామివారి విగ్రహాన్ని చూసి, ఆయనకు ఆలయాన్ని నిర్మించారు. దానికి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయమని పేరు పెట్టారు. దేవాదాయ శాఖ రికార్డుల్లోనూ అలాగే ఉంది. ఆయన స్వామివారిని దశరథ తనయుడిగా భావించి దాశరథీ శతకం అంటూ వందకుపైగా పద్యాలు రాశారు. పూర్తి అవగాహనతోనే అక్కడ ఉన్న విగ్రహాన్ని దశరథ తనయుడైన రామచంద్రుడిగా కొలిచారు. కల్యాణంలో వాడడానికి కూడా భక్తరామదాసు మూడు మంగళసూత్రాలను చేయించారు. దశరథుడు, జనకుడు, భక్తుల తరఫున వీటిని చేయించారు. 2012 వరకూ సీతారామచంద్రస్వామి కల్యాణంలోనూ ‘రామచంద్రస్వామినే వరాయ’ అని స్పష్టంగా ఉంది. అదేవిధంగా భక్తరామదాసు దాశరథ శతకంలో ‘దాశరథీ.. కరుణాపయోనిధి’ అని చెప్పారు. దాశరథి అంటే దశరథపుత్రుడని అర్థం.

హైకోర్టులో కేసు.. నివేదిక సమర్పణే ఆలస్యం..

భద్రాద్రి రామయ్యకు సంబంధించిన ఈ అంశంపై 2022లో హైకోర్టులో కేసు నమోదైంది. విచారణ అనంతరం న్యాయస్థానం ఈ విషయంలో అన్ని అంశాల్ని పరిశీలించి, నిగ్గు తేల్చేందుకు ఐదుగురు పండితులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో వేదాంతం రాజగోపాల చక్రవర్తి, ప్రభాకర శర్మ, చింతపల్లి సుబ్రమణ్య శర్మ, సన్యాసి శర్మతోపాటు మరొకరు ఉన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన కమిటీ 2024లో నివేదికను దేవాదాయ శాఖకు సమర్పించింది. ఇక ఆ నివేదిక హైకోర్టుకు అందడమే తరువాయి. అలా అందితేనే పండితులు ఏం తేల్చారన్నది తెలుస్తుంది. భద్రాద్రి రాముడి పుట్టుపూర్వోత్తరాల పంచాయితీకి శుభం కార్డు పడుతుంది. ఐదుగురు సభ్యుల కమిటీ నివేదికను ఇప్పటికే దేవాదాయ శాఖకు సమర్పించినప్పటికీ దాన్ని బయట పెట్టడం లేదని, హైకోర్టుకు సమర్పించడం లేదని పేర్కొంటూ పిటిషనర్‌ కంచర్ల వెంకటరమణ హైకోర్టులో మళ్లీ కోర్టు దిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు ఇటీవల దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది.


గోత్రాలు, ప్రవర మార్చేశారు!

వాల్మీకి రామాయణం, ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధికెక్కిన వావిలికొలను సుబ్బారావు తెలుగులోకి అనువదించిన ‘మందరం’ గ్రంథాల ప్రకారం.. వైవస్వత మన్వంతరం, త్రేతాయుగం, విళంబి నామ సంవత్సరం, చైత్ర శుక్లపక్ష నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో బుధవారం శ్రీరామ జననం జరిగింది. శ్రీరాముడికి ఆ ఏడాది చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం, తొమ్మిదో యేట పరాభవ నామ సంవత్సరంలో ఉపనయనం జరిగాయి. ఆయనకు పన్నెండేళ్లు, సీతకు ఆరేళ్లు ఉన్నప్పుడు.. సౌమ్య నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ త్రయోదశి - ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతారాముల కల్యాణం జరిగింది. అంతేకాని చైత్ర శుద్ధ నవమి నాడు కాదు. సీతారాముల కల్యాణంలో ఇక్ష్వాకు వంశానికి కులగురువైన వశిష్టుడు సూర్యవంశ క్రమాన్ని, జనక మహారాజు తన వంశ క్రమాన్ని వివరించారు. ఆ ప్రకారం శ్రీరాముడిది వశిష్ట గోత్రం, సీతాదేవిది గౌతమస గోత్రం. ఇక శ్రీరామ పట్టాభిషేకం.. ధాత నామ సంవత్సరం చైత్ర శుద్ధ సప్తమి, గురువారం, పుష్యమి నక్షత్రంలో జరిగింది. ఇటీవల భద్రాచలంలో నిర్వహిస్తున్న రామనారాయణ, లక్ష్మీదేవిల కల్యాణం సందర్భంగా ఎదురుకోలు, కల్యాణం, పట్టాభిషేక ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. శ్రీరాముడి వివాహ తంతులో అర్చక, పండిత మహాశయులు ఇటీవలి కాలంలో భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ‘అచ్యుత గోత్రోద్భవాయా’ అంటూ శ్రీరామచంద్రుడి స్థానంలోకి రామనారాయణ స్వామిని తెచ్చారు. క్షత్రియుడైన శ్రీరాముణ్ని ‘అచ్యుత గోత్రం’తో బ్రాహ్మణుడిగా మార్చేశారు!! సీతాదేవి స్థానంలో సీతామహాలక్ష్మిని తెచ్చి.. ప్రవర మార్చేశారు! ‘సౌభాగ్య గోత్రం’ ఇచ్చేశారు!! శ్రీరాముడి ‘వశిష్ట గోత్రం’, సీతాదేవి ‘గౌతమస గోత్రం’.. ఎలా, ఎందుకు, ఎక్కడికి వెళ్లిపోయాయో తెలియదు. వైష్ణవ సంప్రదాయాల ప్రకారం మహా విష్ణువు శాస్త్రోక్త ఆవిర్భావాన్ని ‘ఆది మధ్యాంత రహితమైన నిత్య స్వరూపం’గా పేర్కొనడం జరిగింది. శ్రీమహావిష్ణువు కారణజలధిపై యోగనిద్రలో విరాజిల్లుతూ ఉంటాడని భాగవత పురాణం వివరిస్తోంది.


విష్ణువును సాధారణ అర్థంలో జన్మించినవాడిగా కాకుండా సర్వసృష్టికి మూలకారకుడిగా అవతరించిన పరతత్త్వ స్వరూపుడిగా భావిస్తారు. అలాంటప్పుడు ఆయన అచ్యుత గోత్రోద్భవుడు ఎలా అవుతాడు? విష్ణు పురాణం, భాగవతం తదితర గ్రంథాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ సమయంలో ఆమె స్వయంగా మహా విష్ణువును తన నిత్య సహచరుడిగా (భర్తగా) ఎంచుకుంది. అలాంటప్పుడు ఆమె ‘సౌభాగ్య గోత్రోద్భవి’ ఎలా అయింది? అంతేకాదు.. వారి వర్ణం, ప్రవర, గోత్రం తదితర వివరాల గురించి కూడా శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లభించదు. అలాంటప్పుడు అచ్యుత, సౌభాగ్య గోత్రాల సాధికారత ఏమిటి? అంతా అగమ్యగోచరం! విశేషమేంటంటే.. గతంలోని ఎదుర్కోలు వేడుకలో సీతాదేవి, శ్రీరాముడి పక్షం వహించిన ఇద్దరు ‘విశిష్ట వశిష్టుల స్థాయి’ ఆచార్యవర్యులు మాటల ద్వంద్వ యుద్ధం చేశారేమో? అనిపించింది. సీతారాముల గుణగణాలను వర్ణించేటప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. కానీ, రామాయణాన్ని తమదైన శైలిలో అన్వయించుకుంటూ వివాహానంతర కాండలలో ఉన్న విషయాలను ప్రస్తావించడం భావ్యమా? కనీసం ఈ పరాభవ నామ సంవత్సరంలోనైనా భక్త రామదాసు భావాలకు, వాల్మీకి మహర్షి సంస్కృత రామాయణ రచనకు, ఆంధ్ర వాల్మీకి యథాతథ తెలుగు అనువాదానికి అనుగుణంగా.. వచ్చే శుక్రవారం భద్రాచలం క్షేత్రంలో నిర్వహించే వేడుకను రామనారాయణ, మహాలక్ష్మీ కల్యాణంగా కాకుండా.. శ్రీ సీతారాముల కళ్యాణంగా జరిపించాలి. కల్యాణానికి వచ్చే ఆహూతులకు, భక్తులకు, టీవీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా, తప్పుదారి పట్టించకుండా సరళమైన తెలుగులో చెప్పాలి. ఎదుర్కోలు, పట్టాభిషేకం వివరాలు కూడా అలాగే చెప్పాలి. ఆ వేడుక పవిత్రతను కాపాడాలి.

- వనం జ్వాలా నరసింహారావు

Updated Date - Mar 20 , 2026 | 05:32 AM