ఫేస్‌బుక్‌లో భార్య ‘సిమెంట్ ఔర్ డ్రమ్’ పోస్టు!
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:21 AM
భార్య ఫేస్‌బుక్‌లో ఉన్న పోస్టులు చూసి ఆమె భర్త జడుసుకున్నాడు! ఈ భార్య నాకు వద్దు బాబోయ్.. నిక్షేపంగా ప్రియుడి ఇంటికి ఆమె వెళ్లిపోవొచ్చు అని అనుమతిచ్చేశాడు...
భయపడిపోయిన భర్త..
ప్రియుడితోనే భార్య ఉండేందుకు అంగీకారం.. యూపీలో ఘటన
బులందర్‌షహర్, మార్చి 19: భార్య ఫేస్‌బుక్‌లో ఉన్న పోస్టులు చూసి ఆమె భర్త జడుసుకున్నాడు! ఈ భార్య నాకు వద్దు బాబోయ్.. నిక్షేపంగా ప్రియుడి ఇంటికి ఆమె వెళ్లిపోవొచ్చు అని అనుమతిచ్చేశాడు! ఆయనలో ఉన్నపళంగా ఎందుకీ మార్పు? అనంటే.. ఆమె ఫేస్‌బుక్ పేజీలో ‘సిమెంట్ ఔర్ డ్రమ్’, ‘నీలా డ్రమ్ ఔర్ సిమెంట్’ శీర్షికలతో హత్యా కథనాలు ఉండటమే! అలా అతడు భార్య చేతిలో తన ప్రాణాలను కాపాడుకున్నాడు. బాధితుడు యూపీలోని బులందర్‌షెహర్‌కు చెందిన రాజ్‌కుమార్! అతడికి భార్య, ఆరు నెలల బిడ్డ ఉన్నారు. భార్య తరచూ గొడవపడి అలిగి పుట్టింటికి వెళ్లి.. ప్రియుడితో కలిసి తిరిగేది. భార్య ప్రవర్తనను అనుమానించి.. నిలదీసిన ప్రతిసారి ‘ఏమిటీ సాక్ష్యం?’ అంటూ ఉల్టా తననే నిలదీసేదని రాజ్‌కుమార్ చెప్పాడు. ఇటీవల ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండగా రాజ్‌కుమార్ ఆమె నుంచి చాకచక్యంగా ఫోన్ లాక్కొని చూశాడు. ఫోన్ గ్యాలరీలో కొన్ని నగ్న దృశ్యాలు కనిపించాయి. ఫేస్‌బుక్ ఓపెన్ చేయగా.. హత్యా కథనాలు కనిపించాయి. గత ఏడాది మార్చిలో మీరట్‌లో ముస్కాన్ అనే మహిళ, తన భర్త సౌరభ్‌ను ప్రియుడు సాహిల్‌తో కలిసి హత్యచేసి.. మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్‌లో ఉంచి పైనుంచి సిమెంట్‌తో కప్పేయడం అప్పట్లో సంచలనమైంది! అయితే భార్య.. ఫేస్‌బుక్‌లో ‘సిమెంట్ ఔర్ డ్రమ్’ శీర్షికతో హత్యా కథనాన్ని పోస్టు చేయడంతో రాజ్‌కుమార్ హడలిపోయాడు. ఆమెతో కలిసి ఉంటే.. తనను ఎప్పుడు చంపేస్తుందోనని భయపడిపోయాడు. తాను ఎవరితో జీవించాలనుకుంటుందో చెప్పాలని మధ్యవర్తులతో ఆమెను అడిగించాడు. ప్రియుడితోనే కలిసి ఉండాలనుకుంటున్నట్లు ఆమె తేల్చి చెప్పడంతో మరోమాట మాట మాట్లాడకుండా ఓకే చెప్పేశాడు రాజ్‌కుమార్!