పోలీసులకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు
ABN , Publish Date - Jan 30 , 2026 | 06:01 PM
ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరి ఆయన ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.. ఇంతకీ ఆయన పోలీసులను ఏమన్నారు.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
హైదరాబాద్, జనవరి30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు.. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో నాపై, నా కుటుంబం పై రాజకీయ కక్షకు తెగబడ్డారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను. అంతే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కావు. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరిని వేడుకుంటున్నాను.’ అని అభ్యర్థిస్తూ కౌశిక్ రెడ్డి వీడియో విడుదల చేశారు.
అసలేం జరిగిందంటే..
గురువారం నాడు వీణవంకలోని స్థానిక సమ్మక్క సారలమ్మ జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లారు. ఆ సమయంలో పోలీసులకు, కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన కౌశిక్ రెడ్డి.. ఐపీఎస్ అధికారిని మతం పేరుతో దూషించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం.. కౌశిక్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన కౌశిక్ రెడ్డి.. పోలీసులకు క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు.
Also Read:
నడి రోడ్డుపై వృద్ధురాలి అంత్యక్రియలు.. కారణం ఏంటంటే..
పోలీసులకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు
ఫిబ్రవరిలో ఎన్‌సీపీ వర్గాల విలీనం.. అధ్యక్ష పదవికి పోటీలో నలుగురు