నడి రోడ్డుపై వృద్ధురాలి అంత్యక్రియలు.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Jan 30 , 2026 | 06:04 PM
బిహార్‌కు చెందిన ఓ కుటుంబం నడి రోడ్డుపై వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించింది. శ్మశానానికి వెళ్లే మార్గం ఆక్రమణకు గురవడంతో ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు..
ఇంటర్‌నెట్ డెస్క్: బిహార్ రాష్ట్రంలో మనసును కలిచివేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు.. వృద్ధురాలి అంత్యక్రియలను నడి రోడ్డుపై నిర్వహించారు. శ్మశానానికి వెళ్లే మార్గం ఆక్రమణకు గురవడంతో ఆగ్రహానికి గురైన వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వైశాలి జిల్లాలోని సోందో వాసుదేవ్ గ్రామానికి చెందిన 91 ఏళ్ల ఝపీ దేవి బుధవారం అనారోగ్యం కారణంగా చనిపోయింది. మరుసటి రోజు కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఝపీ దేవి మృతదేహాన్ని శ్మశానికి తరలించారు.
అయితే, శ్మశానికి వెళ్లే మార్గాన్ని స్థానిక వ్యాపారులు ఆక్రమించేశారు. అక్కడ షాపులు కట్టేశారు. ఝపీ దేవి కుటుంబ సభ్యులు శవాన్ని అక్కడినుంచి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించగా.. ఆ వ్యాపారులు అడ్డుకున్నారు. ఆ రోడ్డు గుండా లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో ఝపీ దేవి కుటుంబసభ్యులు వేరే మార్గాల ద్వారా శ్మశానంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వారు.. నడి రోడ్డుపైనే ఝపీ దేవికి అంత్యక్రియలు నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు అటు వైపు ఎవరూ రాకుండా చూసుకున్నారు.
సంఘటనపై స్థానికులు మాట్లాడుతూ.. ‘శ్మశానానికి వెళ్లే మార్గం చాలా కాలం క్రితమే ఆక్రమణకు గురైంది. ఈ కారణంగా గ్రామస్తులంతా ఇబ్బందులు పడుతున్నాము. అధికారులకు చాలా సార్లు ఫిర్యాదు చేశాము. కానీ చర్యలు తీసుకోలేదు’ అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన ఈ సంఘటనపై వైశాలి జిల్లా మేజిస్ట్రేట్ వర్షా సింగ్ దర్యాప్తునకు ఆదేశించారు. ఇందుకోసం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఫిబ్రవరిలో ఎన్‌సీపీ వర్గాల విలీనం.. అధ్యక్ష పదవికి పోటీలో నలుగురు
దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం.. పాక్ పీఎం ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా రియాక్షన్