Share News

ఐఐఐటీ జంక్షన్‌లో ఏడాది పాటు ట్రాఫిక్‌ మళ్లింపు

ABN , Publish Date - Apr 09 , 2026 | 08:28 AM

గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద మల్టీ లెవల్‌ ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు.

ఐఐఐటీ జంక్షన్‌లో ఏడాది పాటు ట్రాఫిక్‌ మళ్లింపు

  • ఫ్లై ఓవర్ల నిర్మాణ పనుల నేపథ్యంలో చర్యలు

హైదరాబాద్‌ సిటీ: గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద మల్టీ లెవల్‌ ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు. ఏప్రిల్‌ 9 నుంచి సుమారు ఒక సంవత్సరం పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒకేసారి పలు మార్గాల్లో 3 ఫ్లై ఓవర్ల నిర్మాణ పనుల కారణంగా ఐఐఐటీ జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..

  • గచ్చిబౌలి జంక్షన్‌, ఐఐఐటీ జంక్షన్‌, గచ్చిబౌలి స్టేడియం, హెచ్‌సీయూ గేట్‌ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఐఐఐటీ జంక్షన్‌ వద్ద మళ్లించి, విప్రో జంక్షన్‌ మీదుగా వెళ్లి కుడి వైపు మలుపు తీసుకొని గౌలిదొడ్డి, గోపన్‌పల్లి జంక్షన్‌, నల్లగండ్ల మీదుగా లింగంపల్లి మార్గంలో పంపిస్తారు.

  • గోపన్‌పల్లి తండా, గౌలిదొడ్డి, క్యూ సిటీ, కోకాపేట్‌ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను విప్రో జంక్షన్‌ వద్ద మళ్లించి, నానక్‌రామ్‌గూడ రోటరీ-2 వద్ద ఎడమవైపు మళ్లించి ఓఆర్‌ఆర్‌ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌ మార్గంలో పంపిస్తారు.


city3.2.jpg

  • లింగంపల్లి, హెచ్‌సీయూ, మసీద్‌బండ టీ జంక్షన్‌, డీఎల్‌ఎఫ్‌ జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి, కొత్తగూడ, మెహిదీపట్నం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను మజీద్‌బండ వద్ద మళ్లించి శ్రీరామ్‌నగర్‌ బొటానికల్‌ జంక్షన్‌, ఉడిపి హోటల్‌ వద్ద కుడి మలుపు తీసుకొని గచ్చిబౌలి జెడ్పీహెచ్‌ఎస్, గచ్చిబౌలి జంక్షన్‌ మార్గం వైపు మళ్లిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2026 | 08:28 AM