హోర్ముజ్‌పై ఇరాన్ కీలక ప్రకటన.. ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని ఆదేశం..
ABN , Publish Date - Apr 09 , 2026 | 07:42 AM
కాల్పుల విరమణ ఒప్పందం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
టెహ్రాన్, ఏప్రిల్ 9: ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. 40 రోజుల యుద్ధం అనంతరం రెండు దేశాలు 15 రోజుల పాటు కాల్పులు ఆపేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచింది. ఈ విషయంలో అన్ని దేశాలు సంతోషం వ్యక్తం చేశాయి. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇరాన్ కీలక ప్రకటన..
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ గురువారం కీలక ప్రకటన చేసింది. ‘హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించాలని భావిస్తున్న అన్ని నౌకలు సముద్ర భద్రతా సూత్రాలకు అనుగుణంగా.. సముద్రపు మైన్ల (నీటి అడుగున ఉండే బాంబులు) వల్ల జరిగే ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి’ అని పేర్కొంది. హోర్ముజ్ జలసంధిలో ఇటీవల జరిగిన సైనిక ఘర్షణల వల్ల అక్కడ సముద్రపు మైన్లు ఉన్నాయని, అవి వాణిజ్య నౌకలకు ప్రమాదకరమని ఇరాన్ పేర్కొంది. నౌకలు ఈ మైన్లను ఢీకొంటే భారీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నందున, సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించింది.
ఆగని దాడులు
అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణ ప్రకటించినా లాభం లేకుండా పోయింది. అమెరికా తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ సమ్మతం తెలిపింది. కానీ, లెబనాన్‌పై మాత్రం యుద్ధం ఆగదని స్పష్టం చేసింది. అయితే, బుధవారం తమ దేశంలోని చమురు రిఫైనరీతోపాటు పలు ప్రాంతాలపై దాడులు జరిగినట్టు ఇరాన్ ఓ ప్రకటన చేసింది. మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగాయి. ఇక, ఇరాన్‌పై జరిగిన దాడులపై అమెరికా స్పందించింది. కాల్పుల విరమణ ప్రకటన జరిగిన వెంటనే అమెరికా సైన్యం దాడులు నిలిపివేసిందని అమెరికా సైనికాధికారి ఒకరు తెలిపారు. కానీ, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
బిల్లులు కడితేనే ఎత్తిపోతలకు విద్యుత్
నాటో నుంచి అమెరికా వైదొలగనుందా? కీలక భేటీలో తేలిన అంశాలేంటి?