Share News

బిల్లులు కడితేనే ఎత్తిపోతలకు విద్యుత్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 07:25 AM

రూ.33వేల కోట్ల మేర బిల్లులు బకాయి పడ్డారు. ఇకపై బిల్లులు చెల్లిస్తేనే ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ సరఫరా చేస్తాం. లేదంటే ఇవ్వలేం.. అంటూ నీటి పారుదల శాఖకు ఇంధన శాఖ తేల్చిచెప్పింది.

బిల్లులు కడితేనే ఎత్తిపోతలకు విద్యుత్‌

  • రూ.33 వేల కోట్లకు పైగా బకాయిలున్నాయి.. నీటి పారుదల శాఖకు ఇంధన శాఖ అల్టిమేటం

  • ఎత్తిపోతల పథకాలు ఐరావతంలా మారాయి: ఉప ముఖ్యమంత్రి భట్టి

  • ఆచితూచి పంపులు నడపండి: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రూ.33వేల కోట్ల మేర బిల్లులు బకాయి పడ్డారు. ఇకపై బిల్లులు చెల్లిస్తేనే ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ సరఫరా చేస్తాం. లేదంటే ఇవ్వలేం.. అంటూ నీటి పారుదల శాఖకు ఇంధన శాఖ తేల్చిచెప్పింది. ఎత్తిపోతల పథకాల పంపులను ఏ సమయంలో ఆపరేట్‌ చేయాలి?, బకాయిల చెల్లింపుల అంశంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక, ఇంధన, నీటపారుదల శాఖ ఉన్నతాధికారులు, ట్రాన్స్‌కో , డిస్కమ్‌ల సీఎండీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకే ఎత్తిపోతల పథకాల పంపులు నడిపించాలని, ఆ సమయంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి అధికంగా ఉంటుందని, తక్కువ ధరకు విద్యుత్‌ లభిస్తుందని సూచన చేశారు. దీనివల్ల విద్యుత్‌ సంస్థలపైనా భారం పడదన్నారు. విద్యుత్‌ సంస్థలు రూ.50 వేల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్నాయని, ఇందులో రూ.33,653కోట్లు నీటిపారుదల శాఖ నుంచే రావాలన్నారు. బిల్లులు కట్టకుండా 24 గంటల పాటు విద్యుత్‌ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అధిక ధరకు లభించే కరెంట్‌తో కాకుండా తక్కువ ధరకు లభించే సౌరవిద్యుత్‌తో పంపింగ్‌ చేసుకోవాలని నవీన్‌ మిట్టల్‌ సూచించారు.


ఇందుకు ఎత్తిపోతల పథకాల సలహాదారుడు పెంటారెడ్డి బదులిస్తూ.. ఎత్తిపోతల పథకాల్లో వినియోగించే మోటార్లు/పంపులను పగటిపూట నడిపించి రాత్రి పూట ఆపితే పంపులు దెబ్బతింటాయని తెలిపారు. కాళేశ్వరంలోని ప్యాకేజీ-6లో నంది మేడారం పంప్‌హౌస్‌లోని ఓ మోటార్‌, ప్యాకేజీ-8లో రామగుడులోని పంపులు గతంలో దెబ్బతింటే ఒక్కో పంపు మరమ్మతుకు రూ.25 కోట్లు ఖర్చయిందని చెప్పారు. ఇతర పంపులకు, ఎత్తిపోతల పథకాల పంపులకు తేడా ఉందని, 24 గంటల పాటు నిరాటంకంగా ఏడాదంతా పంపులు నడిచినా ఫర్వాలేదు కానీ ఉదయం నడిపి రాత్రి ఆపేస్తే పంపుల్లోని ఇంపెల్లర్‌లు దెబ్బతింటాయని చెప్పారు. అయితే, పంపులు నడిపించాలనుకుంటే బిల్లులు చె ల్లించాలని ఇంధన శాఖ స్పష్టం చేసింది.


ఐరావతంలాగా వదిలేసి పోయారు: భట్టి

అవసరం ఉన్నా, లేకున్నా ఎత్తిపోతల పథకాలు చేపట్టి, బిల్లులు చెల్లించకుండా వాటిని ఐరావతాల్లా వదిలేసి వెళ్లిపోయారని బీఆర్‌ఎస్‌ తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆక్షేపించారు. రూ.వేల కోట్ల చెల్లింపులు చేయకుండా, రూ.లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. నిధులన్నీ అప్పులు చెల్లించడానికే సరిపోతున్నాయన్నారు. మధ్యే మార్గంగా ఒక పరిష్కారానికి రావాలని అధికారులకు సూచించారు.

తాగునీటి అవసరాలకే లిఫ్టులు వాడితే మేలు: ఉత్తమ్‌

తాగునీటి అవసరాలు తీర్చడానికే ఎత్తిపోతల పథకాల పంపులు నడిపించడం మేలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. వరి సాగుకు ప్రాజెక్టుల నుంచి గ్రావిటీతో నీరు అందిస్తే బాగుంటుందని అన్నారు. అడ్డదిడ్డంగా నడిపి..కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటార్లు/పంపులు పాడు చేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదని, మోటార్లు దెబ్బతినాలని ప్రభుత్వం ఎందుకు కోరుకుంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురద వేయడానికే మతి లేని ఆరోపణలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎ్‌సపై మండిపడ్డారు. ఆచితూచి పంపులు నడిపించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

Updated Date - Apr 09 , 2026 | 07:27 AM