Supreme Court: నల్లమల సాగర్‌పై సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం..
ABN , Publish Date - Jan 12 , 2026 | 01:44 PM
పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణా ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చట్టపరమైన సాంకేతిక కారణాల దృష్ట్యా తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది తెలంగాణా సర్కార్.
ఢిల్లీ, జనవరి12 (ఆంధ్రజ్యోతి): నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు(Nallamala Sagar Project Dispute) సంబంధించి సుప్రీంకోర్టులో(Supreme Court) దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉపసంహరించుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ అధికారికంగా ప్రకటించారు. పిటిషన్ ఉపసంహరణ నేపథ్యంలో కేసును డిస్పోజ్ ఆఫ్ చేసినట్లుగా ధర్మాసనం వెల్లడించింది.
రిట్ పిటిషన్‌తో ఉపయోగం ఉండదు: సీజేఐ
ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వానికి సీజేఐ కీలక సూచనలు చేశారు. నల్లమల సాగర్ అంశంపై రిట్ పిటిషన్ ద్వారా ముందుకు వెళ్లడం ప్రయోజనకరం కాదని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు రిట్ పిటిషన్ సరైన మార్గం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి తమ వాదనలు, అభ్యంతరాలను వినిపించాలంటే ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించారు. అదే సరైన న్యాయపరమైన మార్గమని అభిప్రాయపడ్డారు. తెలంగాణా ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరించుకోవడంతో ఈ కేసును సుప్రీంకోర్టు డిస్పోజ్ ఆఫ్ చేసినట్లు ఆయన ప్రకటించారు. దీంతో భవిష్యత్తులో సివిల్ సూట్ రూపంలో ఈ అంశం మరోసారి కోర్టు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
నల్లమల సాగర్ వివాదం నేపథ్యం
పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్‌కు నీటిని తరలించే లింక్ ప్రాజెక్టుపై తెలంగాణా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు లేవని, బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తన పిటిషన్‌లో పేర్కొంది.
సివిల్ సూట్ ద్వారా న్యాయ పోరాటం...
చట్టపరంగా మరింత పటిష్ఠంగా వ్యవహరించాలనే సుప్రీంకోర్టు సూచనతో తెలంగాణా ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకుంది. కేవలం పాలనాపరమైన ఉత్తర్వుల కోసం కాకుండా, శాశ్వత పరిష్కారం కోసం సివిల్ సూట్ ద్వారా న్యాయపోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల గోదావరి జలాల తరలింపుపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించే అవకాశం ఉంటుందని సర్కార్ భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..
పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ
Read Latest Telangana News And Telugu News