Share News

Dogs Tragic incident : హనుమకొండ జిల్లాలో దారుణం.. భారీగా వీధి కుక్కల హతం

ABN , Publish Date - Jan 12 , 2026 | 09:38 AM

హనుమకొండలో భారీ సంఖ్యలో వీధి కుక్కలను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ సిబ్బందే స్వయంగా ఈ దారుణానికి ఒడిగట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మూగజీవాల పట్ల ఇంతటి క్రూరత్వమా అని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

Dogs Tragic incident : హనుమకొండ జిల్లాలో దారుణం.. భారీగా వీధి కుక్కల హతం
Dogs Tragic incident

హనుమకొండ, జనవరి12 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ జిల్లాలోని శాయంపేట మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో భారీ సంఖ్యలో వీధి కుక్కలను హతమార్చిన(Dogs Tragic incident) ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామ పంచాయతీ సిబ్బంది దాదాపు 200కు పైగా శునకాలను హతమార్చినట్టు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో..

పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. శాయంపేట మండల పరిధిలోని శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో కొద్దిరోజుల క్రితం పెద్దఎత్తున వీధి కుక్కలను హతమార్చారు. గ్రామాల్లో ఒక్కసారిగా కుక్కలు కనిపించకుండా పోవడంతో అనుమానం వ్యక్తమైంది. అనంతరం.. ఈ విషయం స్వచ్ఛంద సంస్థల దృష్టికి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


పంచాయతీ సిబ్బందిపై ఆరోపణలు..

ఈ ఘటనకు గ్రామ పంచాయతీ సిబ్బందే బాధ్యులని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. ముందస్తు అనుమతులు లేకుండా, జంతు హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తూ వీధి కుక్కలను చంపారని ఫిర్యాదులు అందాయి. కుక్కలను విషప్రయోగం ద్వారా లేదా ఇతర మార్గాల్లో హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో..

ఈ ఘటనపై జంతు సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.


సర్పంచ్ ఏమన్నారంటే..

ఈ ఘటనపై శాయంపేట గ్రామ సర్పంచ్ స్పందించారు. గ్రామంలో కుక్కలు తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నాయని, ప్రజలకు ప్రమాదం జరగకుండా ఉండేందుకే వ్యాధి బారినపడిన శునకాలను మాత్రమే చంపేసినట్లు తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు చేపట్టామని సర్పంచ్ పేర్కొన్నారు. అయితే.. సర్పంచ్ వ్యాఖ్యలను స్వచ్ఛంద సంస్థలు ఖండిస్తున్నాయి. వ్యాధి నిర్ధారణకు అవసరమైన వైద్య నివేదికలు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా కుక్కలను హతమార్చారని ఆరోపిస్తున్నాయి.

వెలికితీత..

ఈ ఘటనపై తీవ్రత పెరగడంతో పశు వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గ్రామాల్లో పాతిపెట్టిన కుక్కల శవాలను వెలికితీసి.. వాటి నుంచి శాంపిల్స్ సేకరించారు. కుక్కలు నిజంగా ఏదైనా వ్యాధితో మృతిచెందాయా? లేక ఇతర కారణాలతో హతమార్చారా అన్నది ల్యాబ్ పరీక్షల ద్వారా తేలనుంది.

ల్యాబ్ నివేదిక కోసం..

సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపినట్లు పశు వైద్యాధికారులు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడుతుందని చెప్పారు. వ్యాధి కారణమైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. చర్యలు తీసుకున్నారా? లేక అక్రమంగా హత్యలు జరిగాయా? అనేది దర్యాప్తులో తేలనుంది. పోలీసులు.. గ్రామపంచాయతీ సిబ్బంది, సర్పంచ్, పశు వైద్యాధికారులు, స్థానికులను విచారిస్తున్నారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన..

ఈ ఘటన కొన్ని రోజుల క్రితం జరిగినప్పటికీ.. తాజాగా బయటకు రావడం గమనార్హం. సమాచారం దాచిపెట్టారా? లేక స్థానికుల భయంతో విషయం బయటకు రాలేదా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

జంతు హక్కుల సంఘాల ఆగ్రహం..

ఈ ఘటనపై జంతు హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. కుక్కల స్టెరిలైజేషన్, టీకాల కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా.. వాటిని హతమార్చడం అన్యాయమని పేర్కొంటున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..

బోరబండలో ఉన్మాది ఘాతుకం.. మాట్లాడటం లేదన్న అనుమానంతో...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 11:05 AM