తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 23 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026: మంత్రి వాకిటి శ్రీహరి
ABN , Publish Date - Sep 21 , 2026 | 07:20 PM
: తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 నిర్వహిస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 నిర్వహిస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి (Telangana Minister Vakiti Srihari) తెలిపారు. ఈ గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈరోజు (సోమవారం) ఈ గేమ్స్ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే, క్రీడా వేదికలు, మౌలిక వసతులపై మంత్రి సమీక్షించారు. క్రీడాకారుల వసతి, రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టిసారించామని చెప్పుకొచ్చారు.
గ్రామీణ ప్రాంతాల క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తాం..
వైద్యం, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లపై సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా వచ్చే యువ క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిష్ఠకు తగిన స్థాయిలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని ఆదేశించారు.
ప్రమాదకర కుక్కల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలి..
అలాగే, మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ జంతు సంక్షేమ బోర్డు తొలి సమావేశం జరిగింది. వీధి కుక్కల నిర్వహణ, కుక్క కాట్ల నివారణపై మంత్రి సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలపై చర్చించారు. ABC రూల్స్–2023 అమలుపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ABC కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రమాదకర కుక్కల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని దిశానిర్దేశం చేశారు. జంతు సంరక్షణ కేంద్రాలు, అత్యవసర పశువైద్య సేవల మెరుగుదలపై చర్చించినట్లు తెలిపారు.
చిన్నారులు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి..
చిన్నారులు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. రహదారి భద్రత, ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. జంతువుల పట్ల చట్టబద్ధంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మార్గనిర్దేశం చేశారు. పశుసంవర్థక, మున్సిపల్, పోలీస్, వైద్య శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్
కేసీఆర్, రేవంత్ నయా నిజాంలు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు
మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News