మహిళల ఆర్థికాభివృద్ధికి క్రమశిక్షణ, లాభదాయక వ్యాపారాలపై దృష్టి పెట్టాలి: మంత్రి సీతక్క
ABN , Publish Date - Apr 25 , 2026 | 07:47 PM
మహిళల విద్య, ఉపాధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. త్వరలో మహిళా సంఘ సభ్యుల ఎడ్యుకేషన్ ప్రోఫైల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): మహిళల విద్య, ఉపాధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) వ్యాఖ్యానించారు. త్వరలో మహిళా సంఘ సభ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మహిళల విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈరోజు (శనివారం) బీఆర్‌కే భవన్‌లో సెర్ఫ్ డైరెక్టర్లు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులతో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా సంఘ భవనాల నిర్మాణం, ‘అమ్మకు అక్షరమాల’, సెర్ప్ కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు.
ప్రతి మహిళా అక్షరాస్యురాలిగా ఉండటమే తమ ప్రభుత్వ లక్షమని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. 5,239 గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణ పనులు ఊపందుకున్నాయని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని వీఓ భవనాలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ పనులను వేగవంతం చేస్తున్న అధికారులకు అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది మరో 5,000 వీఓ భవనాలను నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ‘అమ్మకు అక్షరమాల’ ద్వారా ఇప్పటివరకు 6.5 లక్షల మహిళలకు అక్షరజ్ఞానం కల్పించామని వెల్లడించారు.
త్వరలో మరో 6.5 లక్షల మహిళలకు గ్రామాల్లోనే విద్యాబోధన కల్పిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళా సంఘాలు.. బాల్య వివాహాల వంటి సామాజిక రుగ్మతల నిరోధంలో ముందుండాలని పిలుపునిచ్చారు. మహిళల ఆర్థికాభివృద్ధికి క్రమశిక్షణ, లాభదాయక వ్యాపారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. టీనేజ్ బాలికల కోసం స్నేహా సమ్మర్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. లైఫ్ స్కిల్స్, భద్రత, సైకిల్ ట్రైనింగ్ కార్యక్రమాలు చేపడుతామని.. ఈ కార్యక్రమాలను బాలికలంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు: కీలక నియామకాలు
మంగ్లీ కేసు.. న్యాయవాదికి బ్రీత్ టెస్టు వివాదం.. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్
Read Latest Telangana News And AP News And International News And Telugu News