Share News

తెలంగాణ కరువును కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - Nov 22 , 2026 | 05:12 PM

తెలంగాణ కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల నివారణకు రూ.30 వేల కోట్ల సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయాలని పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

 తెలంగాణ కరువును కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
Telangana Minister Ponnam Prabhakar

హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల నివారణకు రూ.30 వేల కోట్ల సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయాలని పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ రోజు(ఆదివారం) గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. ఈ భేటీ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారని అన్నారు. తెలంగాణ నూతన కాంగ్రెస్ ఇన్‌చార్జి బీఎం. సందీప్‌కు స్వాగతం పలుకుతూ ఈ సమావేశంలో తీర్మానించామని తెలిపారు. గత ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పార్టీకి అందించిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశామని చెప్పుకొచ్చారు. మంత్రి సీతక్క, ఏఐసీసీ సెక్రటరీ ఆజ్మత్ హుస్సేన్, సంపత్ కుమార్‌లతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.


ఓబీసీ కులగణనకు అవకాశం కల్పించాలి..

2027 జనగణనలో ఓబీసీ కులగణన కోసం ప్రత్యేక కాలమ్ చేర్చాలని కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో తీర్మానం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జనగణన ప్రశ్నావళిలో ఓబీసీ కులగణనకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ - ప్రభుత్వ సమన్వయంపై ఈ సమావేశంలో చర్చించామని అన్నారు. మండల, గ్రామ, పట్టణ, వార్డు కాంగ్రెస్ కమిటీలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాలను పటిష్ఠపరిచి పార్టీ సంస్థాగత బలోపేతానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. కేంద్ర బీజేపీ నేతల పర్యటనల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటర్ రివిజన్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ఓటు హక్కును కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.


ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను తాము గెలుచుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిసెంబరు 7వ తేదీతో తమ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ రాంలీలా మైదాన్ సభలో తెలంగాణ భాగస్వామ్యంపై పీఏసీ సమావేశంలో ప్రస్తావించామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జి ప్రశంసించారని అన్నారు. కాంగ్రెస్ నూతన ఇంచార్జి బి.ఎం. సందీప్ త్వరలో రాష్ట్ర నాయకులతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం

ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 07:17 PM