Share News

రోడ్ల అభివృద్ధికి పారదర్శకంగా నిధులను వినియోగించాలి: మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:26 PM

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ అంచనాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.

రోడ్ల అభివృద్ధికి పారదర్శకంగా నిధులను వినియోగించాలి: మంత్రి కోమటిరెడ్డి
Telangana Minister Komatireddy Venkata Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాల శాఖ 2026- 27 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Telangana Minister Komatireddy Venkata Reddy) సచివాలయంలో ఇవాళ(బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఈఎన్సీలు మోహన్ నాయక్, జయ భారతి, సీఈలు శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వసంత్ నాయక్, బీవీ రావు, లింగారెడ్డి, నర్సింగ్‌రావు, పలువురు ఆర్ అండ్‌బీ అధికారులు హాజరయ్యారు. గత ఏడాది బడ్జెట్, పనుల పురోగతి, విడుదలైన నిధులపై కూలంకషంగా మంత్రి కోమటిరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖది కీలక పాత్ర..

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ అంచనాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు లాంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో 2047 రైజింగ్ తెలంగాణ నినాదంలో రాష్ట్ర రోడ్ నెట్‌వర్క్ అభివృద్ధి.. అత్యంత కీలకమని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర రోడ్ నెట్‌వర్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ‘హ్యామ్’ రోడ్ల నిర్మాణంతో రాష్ట్రవ్యాప్తంగా అద్దం లాంటి రోడ్లు నిర్మించబోతున్నామని తెలిపారు.


కేంద్ర మంత్రులను కలుస్తా..

ఇప్పటికే ఉన్న బాలారిష్టాలు దాటేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామని.. అధికారులు కూడా మనసుపెట్టి పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మార్గనిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాపై కన్ఫ్యూజన్ లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్ - విజయవాడ (NH 65) 8వ లైన్ విస్తరణ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని వివరించారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ‌ని కలిసి మరోసారి కోరతామని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన రోడ్డు ఇదని... ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడ రెండున్నర గంటల్లో చేరుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కేంద్రప్రభుత్వం సహకారం అందించే ఆయా ప్రాజెక్టుల్లో వేగం పెంచాలన్నారు. ఈ విషయంలో తాను కేంద్ర మంత్రులను కలుస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం

కాంగ్రెస్ దాడులకు దిగింది: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 05:48 PM