Share News

అక్టోబరు జీతంతోనే 2 డీఏలు

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:31 AM

రాష్ట్రంలోని ఉద్యోగులకు రెండు కరువు భత్యాలు(డీఏలు), పెన్షనర్లకు రెండు కరువు రాయితీల(డీఆర్‌) విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

అక్టోబరు జీతంతోనే 2 డీఏలు
DA

  • 2024 జనవరి, జూలై నాటి కరువు భత్యాలు.. వరుసగా 3.6 శాతం, 2.73 శాతం చొప్పున మంజూరు

  • ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

  • బకాయిపడ్డ డీఏలు మొత్తం జీపీఎఫ్‌ ఖాతాల్లోకి

  • ఖజానాపై ఏడాదికి 2,500 కోట్ల భారం

  • ఉద్యోగుల జేఏసీ హర్షం, సీఎంకు కృతజ్ఞతలు

హైదరాబాద్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉద్యోగులకు రెండు కరువు భత్యాలు(డీఏలు), పెన్షనర్లకు రెండు కరువు రాయితీల(డీఆర్‌) విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2024 నుంచి మొత్తం ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతం రెండింటిని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన డీఏను 3.64శాతం, 2024 సంవత్సరం జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన డీఏను 2.73 శాతం మేర ఉద్యోగుల మూల వేతనంలో కలపనుంది. ఈ మేరకు మొత్తం 6.37శాతం మేర అదనపు మొత్తం ఉద్యోగుల వేతనంలో కలవనుంది. ఈ రెండు డీఏలను అక్టోబరు వేతనంతో కలిపి నవంబరు 1న ప్రభుత్వం చెల్లించనుంది.


డీఏల మంజూరుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.2,500కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం రెండు డీఏలకు సంబంధించిన జీవోలను వేర్వేరుగా జారీ చేశారు. ఉద్యోగులకు డీఏల చెల్లింపు అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 2024కు సంబంధించి రెండు, 2025కు సంబంధించి రెండు, 2026కు సంబంధించి రెండు... మొత్తం ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎంతో ఉద్యోగుల జేఏసీ చర్చలు జరిపిన సందర్భంలోనే రెండు డీఏలను మంజూరుకు హామీ లభించింది. ఈ నెల 1న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో రెండు డీఏల చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగులకు దసరా కానుకగా రెండు డీఏలు అందుబాటులోకి వచ్చాయి.


కరువు భత్యాల వర్తింపు ఇలా...

  • ప్రస్తుతం 33.67 శాతం డీఏ అమల్లో ఉండగా.. తాజాగా మంజూరు చేసిన 6.37 శాతంతో(రెండు డీఏలతో) కలిపి అది 40.04శాతానికి పెరగనుంది.

  • ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్‌ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్‌ చార్జ్‌డ్‌ సంస్థల ఉద్యోగులు, సిబ్బందికి ఈ డీఏలు అందుతాయి.

  • 2020లో సవరించిన వేతనాలు పొందుతున్న ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ సిబ్బంది, వర్సిటీల్లోని బోధన, బోధనేతర సిబ్బంది, ఫుల్‌టైమ్‌ కాంటింజెంట్‌ ఉద్యోగులతోపాటు 2015లో సవరించిన వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు పెరిగిన డీఏలు వర్తిస్తాయి.


జీపీఎఫ్‌ ఖాతాల్లోకి బకాయిలు

  • 2024 జనవరి 1 నుంచి రావాల్సిన డీఏకు సంబంధించిన 33 నెలల బకాయిలు, 2024 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన డీఏకు సంబంధించిన 27 నెలల బకాయిలను ఉద్యోగుల జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(జీపీఎఫ్‌) ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

  • 2027 జనవరిలోపు రిటైరయ్యే ఉద్యోగులకు సంబంధించి తొలి డీఏను 33 నెలలు, రెండో డీఏను 27నెలల సమాన వాయిదాల్లో చెల్లిస్తారు.

  • కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్)వర్తించే ఉద్యోగులకు 10శాతం డీఏ బకాయిలను వారి పర్మనెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నంబర్‌(ప్రాన్‌) ఖాతాల్లో జమ చేస్తారు. మిగతా 90శాతం బకాయిలను సమాన వాయిదాల్లో చెల్లిస్తారు.

  • ఈ ఉత్తర్వులు రాక ముందు చనిపోయిన ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను వారి కుటుంబ సభ్యులకు ఒకే సారి చెల్లిస్తారు.


ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ కృతజ్ఞతలు

రెండు కరువు భత్యాల(డీఏల)ను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. రెండు డీఏలు కలిపి 6.37శాతం మేర అదనపు వేతనం అందుతుందని జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పీఆర్సీ నివేదిక తెప్పించుకుని 51 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని, ప్రతి నెలా ఇస్తున్న రూ.1,000కోట్ల పెండింగ్‌ బిల్లులను రూ.2,000కోట్లకు పెంచాలని, పెండింగ్‌ డీఏలను త్వరగా విడుదల చేయాలని కోరారు.


ఇవి కూడా చదవండి...
సర్కార్‌ పనితీరు ఎలా ఉంది? ఏది నచ్చింది.. ఏది నచ్చలేదు..

ఓంకారేశ్వరాలయానికి.. రూ.948.65 కోట్లు
బతికున్న భార్య ఓటును తొలగించాలని.. మరణించిన భర్త దరఖాస్తు!
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 04:31 AM