బతికున్న భార్య ఓటును తొలగించాలని.. మరణించిన భర్త దరఖాస్తు!
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:03 AM
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)లో అక్రమాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల మాన్యువల్‌గా నకిలీ ఫారం-7లు సమర్పించిన బాగోతం బహిర్గతం కాగా.. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ బోగస్ ఫారాలు సమర్పించినట్లు అధికారులకు ఫిర్యాదులు అందడం కలకలం రేపుతోంది.
ఎస్‌ఐఆర్‌లో ఆన్‌లైన్‌లో ఫారం 7 సమర్పణ..
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘటన
ఇంతకుముందు ఇక్కడే మాన్యువల్‌గా 31 నకిలీ ఫారం-7లు సమర్పించిన వ్యక్తులు
బీఎల్‌ఏపై ఈఆర్‌వో ఫిర్యాదు.. కేసు నమోదు
పలు నియోజకవర్గాల్లో బోగస్ ఫారం-7ల తంతు
సమగ్ర పరిశీలనకు అధికారుల ఆదేశాలు
హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)లో అక్రమాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల మాన్యువల్‌గా నకిలీ ఫారం-7లు సమర్పించిన బాగోతం బహిర్గతం కాగా.. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ బోగస్ ఫారాలు సమర్పించినట్లు అధికారులకు ఫిర్యాదులు అందడం కలకలం రేపుతోంది. అది కూడా 24 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి.. బతికున్న తన భార్య పేరును తొలగించాలంటూ దరఖాస్తు చేయడం గమనార్హం. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ బాకారంలోని లేన్-1లో నివసించే బిల్కిస్ సుల్తానా (ఎపిక్ నంబర్-జీటీఆర్ 2671501)కు మూడు దశాబ్దాలుగా ఓటుహక్కు ఉంది. ఆమె భర్త మహ్మద్ రఫీఖుద్దీన్ 2002లో మరణించారు. అయితే 24 ఏళ్ల క్రితం చనిపోయిన రఫీఖుద్దీన్.. బతికున్న తన భార్య బిల్కిస్ సుల్తానా పేరును జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నట్లుగా ఆన్‌లైన్‌లో ఫారం-7 దాఖలైంది.
తన భార్య చనిపోయిందని, ఆమె పేరును తొలగించాలని అందులో రఫీఖుద్దీన్ కోరారు. ఈ ఆన్‌లైన్ దరఖాస్తు ఆధారంగా జాబితా నుంచి బిల్కిస్ సుల్తానా పేరు తొలగింపు కూడా జరిగింది. తన ఓటు రద్దయిందన్న విషయం తెలుసుకున్న బిల్కిస్.. తిరిగి ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు(ఫారం-6) చేసుకోవాల్సివచ్చింది. దీంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది పేర్లు జాబితా నుంచి కనుమరుగు కావడం, చిన్న చిన్న కారణాలతో నోటీసులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇదే ముషీరాబాద్ నియోజకవర్గంలో కొన్ని రోజుల క్రితం 31 ఓట్లను తొలగించాలంటూ బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ) బాలచందర్ బోగస్ ఫారం-7 పత్రాలు సమర్పించినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఫారంలో.. తొలగించాల్సిన ఓటరు పేరుతో సహా ముద్రించి ఉండడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఎన్నికలసంఘం ఆదేశాలతో ముషీరాబాద్ ఈఆర్‌వో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విచారణ జ రిపి.. బాలచందర్‌పై చిక్కడపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలచరదర్‌పై కేసు నమోదైంది.
ఇతర నియోజకవర్గాల్లోనూ..
గోషామహల్, బహదూర్‌పుర, అంబర్‌పేట, కార్వాన్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోనూ బోగస్ ఫారం-7లు సమర్పించారన్న ఆరోపణలున్నాయి. పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో కొందరు వ్యక్తులు వీటిని బీఎల్‌వోలకు అప్పగించి ఆమోదించాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఇటీవల బీఎల్‌వోలకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. చిరునామా మారిన, మరణించిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఫారం-7 సమర్పిస్తేనే మాన్యువల్‌గా తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువు ముగియగా.. చివరిరోజు పలు చోట్ల ఫారం-7లు తీసుకోవాలని బీఎల్‌వోలను కొందరు బెదిరించినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఇదిలా ఉంటే.. మాన్యువల్‌గా, ఆన్‌లైన్‌లో బోగస్ ఫారం-7లు సమర్పించింది ఎవరు? అన్నదానిపై అధికారులు దృష్టి సారించారు. సమగ్ర విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.
నిబంధనలు ఇలా..
వాస్తవంగా చిరునామా మారినవారు, రెండు, మూడు చోట్ల ఓటుహక్కు ఉన్నవారు మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. చిరునామా మారినవారు, రెండు, మూడు చోట్ల ఓటు ఉన్నవారు వ్యక్తిగతంగా ఫారం-7 సమర్పించే అవకాశం ఉంటుంది. దానిని బీఎల్‌వో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆమోదం/తిరస్కరణపై నిర్ణయం తీసుకోవాలి. మరణించిన వ్యక్తుల ఓటు తొలగింపు కోసమైతే ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఫారం-7 సమర్పించాలి. తమ కుటుంబ సభ్యుడేనని ఆధారాలు చూపడంతోపాటు.. మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. కానీ, ఎస్‌ఐఆర్ నేపథ్యంలో వచ్చిన ఫారం-7లో చాలావరకు ఈ వివరాలు లేనట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. బోగస్ ఫారం-7లపై ఫిర్యాదు నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి ముషీరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా ఓ బీఎల్‌వో వద్ద ఉన్న ఫారం-7 దరఖాస్తును పరిశీలించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన వ్యక్తికి సంబంధించి డెత్ సర్టిఫికెట్ లేకుండా ఫారం ఎలా తీసుకున్నారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి...
రాహుల్ పోరాటంతో కేంద్రంలో వణుకు
లైపోప్రొటీన్(ఎ).. సైలెంట్ కిల్లర్
Read Latest AP News And Telugu News