ఆ 45 ఎకరాలు ఎక్కడ!?
ABN , Publish Date - Oct 07 , 2026 | 03:52 AM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో వారి ఫాంహౌస్ భూములకు సంబంధించిన రికార్డులను అప్పగించాలని కోరనున్నారు.
వాటి గుర్తింపునకు సర్వే చేయండి..
రెవెన్యూ అధికారులకు సీఎం ఆదేశం
కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో ముగిసిన సర్వే
343 ఎకరాలే ఉందన్న అధికారులు
రికార్డులకు, భూమికి మధ్య వ్యత్యాసం
భూరికార్డులు సమర్పించాలంటూ కేసీఆర్, కుటుంబీకులకు నోటీసులివ్వాలని నిర్ణయం
సర్వే నంబరు 325లో మిగిలే భూమిలో అమరవీరుల కాలనీ
సకల సౌకర్యాలతో నిర్మించి ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో వారి ఫాంహౌస్ భూములకు సంబంధించిన రికార్డులను అప్పగించాలని కోరనున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో 45 ఎకరాల ఆచూకీ లభ్యం కాకపోవడమే ఇందుకు కారణం. శాసనసభలో గత నెల 16వ తేదీన 22ఏపై నిర్వహించిన చర్చలో భాగంగా కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దాంతో, అక్కడి భూములపై రెవెన్యూ అధికారులు సర్వే కూడా నిర్వహిస్తున్నారు.
విచారణ, సర్వే పురోగతిపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో తాము చేపట్టిన సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలో సర్వే నంబరు 325లో మొత్తం 388 ఎకరాలు ఉందని, తమ సర్వేలో అక్కడ 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలిందని చెప్పారు. రికార్డులో ఉన్న భూమికి, వాస్తవంగా అక్కడ ఉన్న భూమికి మధ్య 45 ఎకరాల వ్యత్యాసం ఉందని వివరించారు. దాంతో, ఆ 45 ఎకరాల భూమి ఎక్కడుందో తేల్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూమి గుర్తింపునకు ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వేకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు.
సర్వే నంబరు 325 సమీపంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భూములు ఉన్నందున.. భూముల రికార్డులు సమర్పించాలంటూ వారికి నోటీసులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ఇక, సర్వే నంబరు 325లో గుర్తించే భూమిని స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం ఇక్కడ అమరవీరుల కాలనీని నిర్మించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాలనీలో అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, సకల సౌకర్యాలతో కాలనీని రూపుదిద్దాలని నిర్దేశించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ అధికారులు తీసుకోవాలని, జూన్ రెండో తేదీలోగా కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే, కొండపాక మండలం వెలికట్ట గ్రామ పరిధిలో అసైన్డ్ భూములు, మిషన్ భగీరథ భూములు మినహా మిగిలిన భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తోపాటు ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. ఎల్‌నినో నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల నీటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. మల్లన్న సాగర్ నీటిని అనధికారికంగా వినియోగించే వారిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, భూ అక్రమాలపై విచారణకు వేసిన కమిటీ, ధరణి అక్రమాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఖర్గే వ్యాఖ్యలు ప్రజల విచక్షణను అవమానించడమే
పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్!
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌కు చెందిన మహిళ మృతి
Read Latest AP News And Telugu News