పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్!
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:15 AM
ట్యాంక్‌బండ్‌పై రోడ్డు దాటుతున్న వారిని ఓ లారీ ఢీకొట్టగా.. పుట్టిన రోజు కేక్ కట్ చేయాల్సిన ఆరేళ్ల చిన్నారితోపాటు ఆ కొత్త జంటలోని భర్త ప్రాణాలు కోల్పోయారు.
ట్యాంక్‌బండ్‌పై కేక్ కటింగ్‌కి వచ్చిన ఆరేళ్ల చిన్నారిని ఢీకొట్టిన లారీ
రోడ్డు దాటుతుండగా ప్రమాదం, చిన్నారి, మరొకరి మృతి
ఆ వ్యక్తికి 3 నెలల క్రితమే వివాహం
రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం
కవాడిగూడ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆరేళ్ల కూతురి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా తమతో సన్నిహితంగా ఉండే కొత్త దంపతులను తీసుకొని ఓ కుటుంబం సినిమాకు వెళ్లింది. సినిమా అయ్యాకా ఆ చిన్నారితో కేక్ కట్ చేయించేందుకు అంతా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. సందడిగా ట్యాంక్‌బండ్‌పై రోడ్డు దాటుతున్న వారిని ఓ లారీ ఢీకొట్టగా.. పుట్టిన రోజు కేక్ కట్ చేయాల్సిన ఆరేళ్ల చిన్నారితోపాటు ఆ కొత్త జంటలోని భర్త ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఆదివారం తెల్లవారుజామున 2:10 గంటలకి చోటు చేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సరాక్షి(6) అనే చిన్నారి, విశ్వనాధ్ అలియాస్ విశ్వంత్ (40) మరణించారు.
రెండు కుటుంబాలకు అంతులేని విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటనకు సంబంధించి దోమలగూడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేడ్చేల్ జిల్లా ఓల్డ్ అల్వాల్ జొన్న బండ ప్రాంతానికి చెందిన సాయినాథ్, అశ్విని దంపతులకు కూతుళ్లు శరణ్య (9) సరాక్షి (6) ఉన్నారు. సాయినాథ్ జొన్నబండలో మీ సేవా కేందాన్ని నిర్వహిస్తున్నాడు. సాయినాథ్ దూరపు బంధువైన విశ్వనాథ్ అలియాస్ విశ్వంత్ (40), అతని భార్య సింధు.. ఆ మీసేవా కేంద్రంలో పని చేస్తున్నారు. విశ్వనాథ్, సింధుకు వివాహమై మూడు నెలలు అవుతోంది. అయితే, సరాక్షి ఆరో పుట్టినరోజు నేపథ్యంలో సాయినాథ్ కుటుంబం, విశ్వనాథ్ దంపతులతో కలిసి శనివారం రాత్రి కూకట్‌పల్లిలోని ఓ థియేటర్‌లో సెకండ్ షో సినిమా చూశారు.
సినిమా పూర్తయ్యాక సరాక్షి జన్మదిన వేడుకలు చేసుకునేందుకు అందరూ కలిసి ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న మగ్దూం మోయినుద్దీన్ విగ్రహం వద్ద కారును పార్కు చేశారు. కారు నుంచి మొదటగా దిగిన విశ్వనాథ్, సాయినాథ్, సరాక్షి ట్యాంక్‌బండ్‌పై హుస్సేన్ సాగర్‌వైపు వెళ్లేందుకు రోడ్డు దాటే యత్నం చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన ఓ లారీ విశ్వనాథ్, సరాక్షిని ఢీకొట్టింది. సరాక్షి అక్కడికక్కడే మరణించగా... తీవ్రంగా గాయపడిన విశ్వనాథ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాయినాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
రూ.400 కోట్లతో సాబన్ మెగా డెయిరీ ప్లాంట్
హైదరాబాద్‌లో జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు: మంత్రి పొంగులేటి
గుజరాత్ ‘చింతన్‌శివిర్’కు మంత్రి కోమటిరెడ్డి
Read Latest AP News And Telugu News