Share News

లైపోప్రొటీన్‌(ఎ).. సైలెంట్‌ కిల్లర్‌

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:15 AM

అతడికి 42 ఏళ్లు. సిగరెట్‌, మందు అలవాట్లు లేవు. ఆరోగ్యస్పృహ ఎక్కువే. వారానికి మూడుసార్లు వ్యాయామం కూడా చేస్తాడు. ఆర్నెల్ల క్రితం మామూలుగా వైద్యపరీక్షలు చేయించుకుంటే కొలెస్ట్రాల్‌ స్థాయులు కూడా సాధారణంగానే ఉన్నాయి. కానీ..

లైపోప్రొటీన్‌(ఎ).. సైలెంట్‌ కిల్లర్‌
Lipoprotein(a)

  • రక్తంలో ఉండే ఒకరకమైన కొవ్వుకణం ఎల్‌పీ(ఎ) ఎక్కువగా ఉంటే హృద్రోగాల ముప్పు

  • 80-90 శాతం వంశపారంపర్యంగా వచ్చే అవకాశం..

  • పరీక్ష చేయించుకుని ముందే జాగ్రత్తపడితే మేలు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అతడికి 42 ఏళ్లు. సిగరెట్‌, మందు అలవాట్లు లేవు. ఆరోగ్యస్పృహ ఎక్కువే. వారానికి మూడుసార్లు వ్యాయామం కూడా చేస్తాడు. ఆర్నెల్ల క్రితం మామూలుగా వైద్యపరీక్షలు చేయించుకుంటే కొలెస్ట్రాల్‌ స్థాయులు కూడా సాధారణంగానే ఉన్నాయి. కానీ.. ఇటీవల గుండెకు సంబంధించిన పరీక్షలు చేస్తే గుండెలోని ఒక ధమని 80శాతానికి పైగా మూసుకుపోయినట్టు బయటపడింది. దీంతో కుటుంబసభ్యులు.. ‘రిపోర్టులన్నీ సాధారణంగానే ఉన్నాయి కదా? మరి ఇలా ఎలా జరిగింది’ అని వాపోయారు. అతడి సమస్యకు కారణం లైపోప్రొటీన్‌-ఏ (ఎల్‌పీ(ఎ)) అని వైద్యులు వారికి వివరించారు. జీవన శైలితో సంబంధం లేకుండా.. ఈ లైపోప్రొటీన్‌(ఎ) గుండె ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని సైలెంట్‌ కిల్లర్‌గా వ్యవహరిస్తారని వైద్యులు తెలిపారు.


చాలా మంది హెల్త్‌ ప్యాకేజీలో భాగంగా.. ఎల్‌డీఎల్‌, హెచ్‌డీఎల్‌, ఈసీజీ, టూ-డి ఈకో వంటి పరీక్షలు చేయించుకుని అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటారు. కానీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి, దక్షిణాసియాలో అయితే ప్రతి నలుగురిలో ఒకరికి.. ఎల్‌పీ(ఎ) స్థాయులు అధికంగా ఉంటున్నాయని, వారు హృద్రోగాల బారిన పడే ముప్పు 2-3 రెట్లు అధికమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) కణానికి అపోలిపోప్రొటీన్‌ (అపో(ఎ)) అనే అదనపు ప్రొటీన్‌ అతుక్కుని ఉంటే అదే లైపోప్రొటీన్‌ (ఎ). మన రక్తంలో ఉండే ఎల్‌డీఎల్‌, హెచ్‌డీఎల్‌, ట్రైగ్లిజరైడ్‌ల వంటివాటి స్థాయులు మన జీవనశైలిని బట్టి మారుతాయి. కానీ.. మన శరీరంలో అపోలిపోప్రొటీన్‌ ఎంత పరిమాణంలో తయారవ్వాలి? దాని అణు పరిమాణం ఎంత ఉండాలి? అనే అంశాలను మన డీఎన్‌ఏలోని ఎల్‌పీఏ జీన్‌ నిర్ధరిస్తుంది.


అంటే, తల్లిదండ్రుల నుంచి మనకు సంక్రమించే జన్యువుల ఆధారంగా పుట్టుకతోనే మన రక్తంలో దీని స్థాయులు నిర్ణయమవుతాయన్నమాట. తల్లిదండ్రుల జన్యువుల్లో లైపోప్రొటీన్‌(ఎ) ఎక్కువగా ఉంటే మనకూ ఎక్కువగా ఉండే అవకాశం అధికం. జీవనశైలి ఎంత నియమబద్ధంగా ఉన్నా.. ఎల్‌పీఏ జన్యువు ఇచ్చే సంకేతాలు మారవు కాబట్టి లైపోప్రొటీన్‌(ఎ) స్థాయులు మా రవు. కాలేయం మన జన్యువులు ఇచ్చే సూచనల ప్రకారమే అపోలిపోప్రొటీన్‌ను తయారుచేస్తుంది. స్టాటిన్స్‌ కూడా ఈ ప్రొటీన్‌ స్థాయులను తగ్గించలేవు. కాబట్టి.. జీ వితంలో ఒక్కసారి ఎల్‌పీ(ఎ) స్థాయులు ఎంత ఉన్నాయో పరీక్ష ద్వారా తెలుసుకుని, ఒకవేళ ఎక్కువ ఉంటే వైద్యుల సలహాతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్‌లోని కొన్ని ల్యాబ్స్‌లో ఈ పరీక్ష ఖర్చు రూ.700 నుంచి రూ.1000 మధ్య ఉంటుందని తెలిపారు. పరీక్షకు ముందు పాటించాల్సిన సూచనలు ల్యాబొరేటరీని బట్టి మారవచ్చని, ముందుగానే వివరాలు తెలుసుకోవాలని సూచించారు.


అభివృద్ధి దశలో ఔషధాలు

ప్రస్తుతం ఎల్‌పీ(ఎ)ను నేరుగా తగ్గించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఔషధాలు అభివృద్ధి దశలో ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయితే ఎల్‌పీ(ఎ) అధికంగా ఉందని తెలిసినంత మాత్రాన ఏమీ చేయలేమనుకోవాల్సిన పని లేదని వారు భరోసా ఇస్తున్నారు. ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించుకోవడం, రక్తపోటు, మధుమేహం వంటివాటిని సమర్థంగా అదుపులో ఉంచడం, అవసరాన్ని బట్టి కరోనరీ కాల్షియం స్కాన్‌ వంటి ఇమేజింగ్‌ పరీక్షలను ముందుగానే చేయించుకోవడం ద్వారా హృద్రోగాల బారిన పడే ప్రమాదాన్ని వీలైనంతవరకూ తగ్గించే అవకాశం ఉంటుందని వారు వివరించారు.


ఎవరికి అవసరం?

కుటుంబంలో చిన్న వయసులోనే గుండెపోటు లేదా స్ట్రోక్‌ వచ్చిన చరిత్ర ఉంటే.. వైద్యులను సంప్రదించి, ఆ విషయం తెలిపి వారి సలహా మేరకు ఎల్‌పీ(ఎ) పరీక్ష చేయించుకోవాలి. తల్లిదండ్రులు, పురుషులైతే 55 ఏళ్లలోపు, మహిళలైతే 65 ఏళ్లలోపు గుండెపోటు లేదా పక్షవాతం (స్ట్రోక్‌) వచ్చిన కుటుంబ చరిత్ర ఉన్నవారు.. చిన్న వయసులోనే యాంజియోప్లాస్టీ, బైపాస్‌ అవసరమైనవారు, గుండె జబ్బులు రావడానికి స్పష్టమైన కారణం కనిపించనివారు కుటుంబంలో గతంలో ఎవరైనా ఉంటే.. ఆ కుటుంబంలోనివారు ఈ పరీక్ష చేయించుకోవాలి. ఎల్‌పీ(ఎ) విలువ తెలుసుకోవడం వైద్యుడికి మొత్తం గుండెజబ్బు ప్రమాదాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది. అవసరమైతే ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ను మరింత కట్టుదిట్టంగా నియంత్రించడం, రక్తపోటు, రక్తంలో చక్కెరను మెరుగ్గా పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఈ పరీక్ష ఒక్కసారి చేయించుకుంటే చాలు.

- డాక్టర్‌ అనిల్‌ కృష్ణ గుండాల,

సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు,

సీఎండి, మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఇండియా


ఇవి కూడా చదవండి...
రాహుల్‌ పోరాటంతో కేంద్రంలో వణుకు

ఆ 45 ఎకరాలు ఎక్కడ!?

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌కు చెందిన మహిళ మృతి
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 04:15 AM