రాహుల్ పోరాటంతో కేంద్రంలో వణుకు
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:00 AM
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంతో కేంద్ర ప్రభుత్వం వణికిపోతోందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకూ విశ్రమించం..
నేతల అరెస్టులను ఖండిస్తున్నాం: సీఎం రేవంత్
అరెస్టులు అప్రజాస్వామికం: కోమటిరెడ్డి
రేపు చలో లోక్‌భవన్.. పాల్గొననున్న సీఎం
హైదరాబాద్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంతో కేంద్ర ప్రభుత్వం వణికిపోతోందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)ను రద్దు చేయడంతోపాటు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ విశ్రమించబోదని స్పష్టం చేశారు. సర్ రద్దు కోసం ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
చట్ట విరుద్ధమైన అరెస్టులు బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శమన్నారు. స్వాతంత్రోద్యమంలో గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి నేతలను నాటి వలస ప్రభుత్వం అరెస్టు చేసిందని, ఇప్పుడు బ్రిటిష్ జనతా పార్టీ (బీజేపీ) కూడా అలానే రాహుల్ గాంధీని అరెస్టు చేసిందని విమర్శించారు. అక్రమ అరెస్టులు, జైళ్లు కాంగ్రెస్ నేతలకు కొత్త కాదని పేర్కొన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థను, దేశ భవిష్యత్తును రక్షించుకునేందుకు ప్రజలు, యువత ఈ పోరాటంలో స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నారనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని హెచ్చరించారు. స్వాతంత్య్రం కోసం వందేళ్లకు పైగా పోరాడిన చరిత్ర కాంగ్రె్‌సకు ఉందని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటంలో విజయం సాధించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అత్యంత హేయమైన చర్య అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును హరించడం బీజేపీ అహంకారపూరిత పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత లోపించిందని, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే.. దానికి సమాధానం చెప్పలేక అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాగా, జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇండీ కూటమి ఆధ్వర్యంలో చలో లోక్‌భవన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఇండీ కూటమి ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి...
ఖర్గే వ్యాఖ్యలు ప్రజల విచక్షణను అవమానించడమే
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌కు చెందిన మహిళ మృతి
Read Latest AP News And Telugu News