Share News

ఆయిల్‌పామ్‌... సుంకం తగ్గింపు దేనికి సంకేతం?

ABN , Publish Date - Oct 08 , 2026 | 01:20 AM

‘దేశంలో వంటనూనెల దిగుమతులను తగ్గించాలి, దేశీయ ఉత్పత్తిని పెంచాలి, రైతులను ఆయిల్‌పామ్ సాగువైపు ప్రోత్సహించాలి, వంటనూనెల విషయంలో దేశాన్ని...

ఆయిల్‌పామ్‌... సుంకం తగ్గింపు దేనికి సంకేతం?

‘దేశంలో వంటనూనెల దిగుమతులను తగ్గించాలి, దేశీయ ఉత్పత్తిని పెంచాలి, రైతులను ఆయిల్‌పామ్ సాగువైపు ప్రోత్సహించాలి, వంటనూనెల విషయంలో దేశాన్ని స్వయం సమృద్ధి వైపు నడిపించాలి’– ఇదీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్‌పామ్’ ద్వారా దేశవ్యాప్తంగా ఆయిల్‌పామ్ విస్తరణను ప్రోత్సహిస్తోంది. కేంద్రం ఇచ్చిన ఈ విధాన సంకేతాన్ని నమ్మి తెలంగాణ వంటి రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు శ్రీకారం చుట్టాయి. ఒకవైపు దేశీయ ఆయిల్‌పామ్ సాగును పెంచాలని చెబుతూ, మరోవైపు విదేశాల నుంచి వచ్చే క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాలను వరుసగా తగ్గించడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. 2024లో దేశీయ నూనెగింజల రైతులను చౌక దిగుమతుల నుంచి రక్షించేందుకు క్రూడ్ ఎడిబుల్ ఆయిల్స్‌పై ఎఫెక్టివ్‌ ఇంపోర్ట్‌ డ్యూటీని 27.5 శాతానికి పెంచిన కేంద్రం, ఆ తర్వాత దానిని 16.5 శాతానికి తగ్గించింది. ఇప్పుడు మరోసారి దిగుమతి సుంకాన్ని తగ్గించే నిర్ణయం తీసుకుంది.

వినియోగదారులకు అందుబాటు ధరల్లో వంటనూనెలు అందించాలనే లక్ష్యం అవసరమైనదే. కానీ ఆ ఉపశమనం కోసం దేశీయ రైతు ఆదాయం, అతని దీర్ఘకాలిక పెట్టుబడి, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆయిల్‌పామ్ విస్తరణ భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా అంతే అవసరం.

ఆయిల్‌పామ్ విస్తరణ కేవలం ఢిల్లీలో ఒక ప్రకటనతో జరగదు. క్షేత్రస్థాయిలో రైతును ఒప్పించాలి, సంప్రదాయ పంటల నుంచి దీర్ఘకాలిక ఆయిల్‌పామ్ సాగువైపు మళ్లించాలి, మొక్కలను అందుబాటులోకి తేవాలి, సాగునీరు, డ్రిప్, తోటల నిర్వహణకు సహకరించాలి, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయించాలి, కంపెనీలు–రైతుల మధ్య సమన్వయం చేయాలి. ఈ మొత్తం బాధ్యతను ప్రత్యక్షంగా నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వాలే. తెలంగాణ ప్రభుత్వం కూడా రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయిల్‌పామ్ సాగును పెద్దఎత్తున ప్రోత్సహించింది. ఫలితంగా రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 3.2 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరించింది. ఇక్కడే అసలు వైరుధ్యం కనిపిస్తోంది. రైతును ఆయిల్‌పామ్ సాగులోకి తీసుకువచ్చే బాధ్యత రాష్ట్రానిది. కానీ అదే రైతు పంట ధరను ప్రభావితం చేయగల దిగుమతి సుంకం నిర్ణయం మాత్రం కేంద్రం చేతిలో ఉంది.


దిగుమతి సుంకాల తగ్గింపుతో చౌకైన విదేశీ పామాయిల్ దేశీయ మార్కెట్‌లోకి వచ్చి రైతు ఆదాయంపై ఒత్తిడి ఏర్పడితే, రైతు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ప్రశ్నించడు. తనకు అందుబాటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్నే అడుగుతాడు. స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీస్తాడు. విధానం కేంద్రానిది, కానీ రైతు ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సింది రాష్ట్రం. ఈ పరిస్థితిని కేంద్రం విస్మరించకూడదు. ఇది కేంద్రం–రాష్ట్రం మధ్య రాజకీయ వివాదంగా చూడాల్సిన అంశం కాదు; సమాఖ్య వ్యవస్థలో వ్యవసాయ విధాన నిర్ణయాలు ఎలా ఉండాలన్న మౌలిక ప్రశ్న. ఆయిల్‌పామ్‌ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలతో సంప్రదించకుండా దిగుమతి విధానంలో తరచూ మార్పులు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన భరోసాను ఎలా నిలబెట్టుకోగలుగుతాయి?

ఆయిల్‌పామ్‌ను ఇతర పంటలతో పోల్చలేం. వేరుశెనగ, సోయాబీన్‌ వంటి పంటలు ఒక సీజన్‌లో గిట్టుబాటు కాకపోతే రైతు తర్వాతి సీజన్‌లో మరో పంటకు మారవచ్చు. ఆయిల్‌పామ్ రైతుకు ఆ అవకాశం లేదు. మొక్క నాటిన తర్వాత వాణిజ్య స్థాయిలో ఆదాయం రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నీటి వసతి, డ్రిప్, ఎరువులు, నిర్వహణపై నిరంతరం పెట్టుబడి పెట్టాలి. ఒకసారి తోట ఏర్పాటు చేసిన రైతు దాదాపు మూడు దశాబ్దాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆ పంటతో ముడిపడి ఉంటాడు. అంటే రైతు నాటింది కేవలం ఆయిల్‌పామ్ మొక్క కాదు; ప్రభుత్వ విధానంపై తన నమ్మకాన్ని. ‘‘విదేశీ పామాయిల్‌ను మరింత చౌకగా తీసుకొస్తే... నా పెట్టుబడికి, నా భవిష్యత్తుకు భరోసా ఎవరు?’’ అని రైతు అడిగితే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

దిగుమతి సుంకం తగ్గినంత శాతంలోనే రైతుకు లభించే ఫ్రెష్‌ ఫ్రూట్‌ బంచెస్‌ (ఎఫ్‌ఎఫ్‌బీ) ధర తగ్గుతుందని చెప్పలేం. అంతర్జాతీయ క్రూడ్‌ పామాయిల్‌ (సీపీఓ) ధరలు, మారకపు విలువ, రవాణా వ్యయం, ప్రాసెసింగ్ మార్జిన్లు, ఎఫ్‌ఎఫ్‌బీ ధర నిర్ణయ విధానం వంటి అనేక అంశాలు తుది ధరను ప్రభావితం చేస్తాయి. కానీ చౌక దిగుమతులు దేశీయ ఉత్పత్తిపై ధరల ఒత్తిడిని పెంచే అవకాశాన్ని విస్మరించలేం. అందుకే నాడు రైతు రక్షణ కోసం అవసరమని భావించిన దిగుమతి రక్షణను నేడు వరుసగా ఎందుకు తగ్గించాల్సి వస్తోంది? అన్నది ప్రశ్న. వినియోగదారుడి ప్రయోజనం ముఖ్యమే, పరిశ్రమ ప్రయోజనం కూడా అవసరమే; కానీ వీటి మధ్య రైతు ప్రయోజనం బలికాకూడదు. ఇప్పటికే ఆయిల్‌పామ్ వేసిన రైతుకు భవిష్యత్ ఆదాయంపై అనిశ్చితి ఏర్పడితే కొత్త రైతులు ఈ పంట వైపు రావడానికి వెనుకాడతారు. తోటల నిర్వహణపై పెట్టుబడులు తగ్గవచ్చు, ప్రాసెసింగ్ సామర్థ్యంపైనా ప్రభావం పడవచ్చు. చివరకు వంటనూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలన్న జాతీయ లక్ష్యానికే ప్రతికూల పరిస్థితి ఏర్పడవచ్చు.


కేంద్ర ప్రభుత్వం వినియోగదారుడిని రక్షించాలి, అదే సమయంలో ఆయిల్‌పామ్ రైతు ఆదాయాన్ని కూడా రక్షించాలి. ఈ రెండూ పరస్పర విరుద్ధ లక్ష్యాలు కావు. ముఖ్యంగా క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాల్లో కీలక మార్పులు చేసే ముందు ఆయిల్‌పామ్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరపాలి. ఆయా రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం, కొత్తగా ఉత్పత్తిలోకి రాబోతున్న తోటలు, ఎఫ్‌ఎఫ్‌బీ ధరలు, రైతుల పెట్టుబడులు, ప్రాసెసింగ్ సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దిగుమతి సుంకాల తగ్గింపు వల్ల ఎఫ్‌ఎఫ్‌బీ ధర ఒక నిర్దిష్ట రక్షణ స్థాయి కంటే పడిపోతే వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ లేదా సమానమైన ఆదాయ రక్షణ వ్యవస్థ రైతుకు వెంటనే అందేలా చూడాలి. ఆయిల్‌పామ్ రైతులకు ప్రత్యేక ధర రక్షణ అవసరం. అన్నింటికంటే ముఖ్యంగా రైతుకు దీర్ఘకాలిక విధాన స్థిరత్వం కావాలి.

ఎందుకంటే ఆయిల్‌పామ్ రైతు తన భూమిని, తన పెట్టుబడిని, తన కుటుంబ భవిష్యత్తును దాదాపు మూడు దశాబ్దాలపాటు ఈ పంటతో ముడిపెట్టాడు. అతను అడిగేది ప్రభుత్వ దయ కాదు– తాను పండించే పంటకు గిట్టుబాటు ధర, తాను పెట్టిన పెట్టుబడికి రక్షణ, ప్రభుత్వం ఇచ్చిన మాటకు భరోసా. ఒక చేత్తో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతులను ఆయిల్‌పామ్ సాగువైపు ప్రోత్సహిస్తూ, మరో చేత్తో విదేశీ పామాయిల్‌కు దిగుమతి మార్గాన్ని మరింత చౌకగా చేస్తే రేపు కొత్త రైతును ఆయిల్‌పామ్ సాగు చేయమని రాష్ట్రాలు ఏ నమ్మకంతో అడగాలి? ఇది కేవలం దిగుమతి సుంకానికి సంబంధించిన ప్రశ్న కాదు; కేంద్రం తీసుకునే నిర్ణయానికి క్షేత్రస్థాయిలో మూల్యం ఎవరు చెల్లిస్తున్నారు అన్న ప్రశ్న. దేశీయ రైతును బలోపేతం చేసి వంటనూనెల్లో స్వయం సమృద్ధి సాధించాలంటే కేంద్రం–రాష్ట్రాలు కలిసి నడవాలి. విధాన నిర్ణయం ఒకచోట, దాని పరిణామాల భారం మరోచోట ఉండకూడదు. ఆత్మనిర్భరత ఒక నినాదంగా మిగలకూడదు, రైతుకు ఇచ్చిన మాటగా నిలవాలి. ఆ మాటను క్షేత్రస్థాయిలో నిలబెట్టే రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను కేంద్ర విధానాలే బలహీనపరచకూడదు.

తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్ర వ్యవసాయ మంత్రి

ఇవి కూడా చదవండి..

రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ ట్రిక్.. పోలీసుల ప్లాన్‌ను ఎలా మార్చారు..

యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Oct 08 , 2026 | 01:20 AM