సమగ్ర విశ్లేషణతోనే నేరాల కట్టడి: డీజీపీ సీవీ ఆనంద్
ABN , Publish Date - Aug 28 , 2026 | 06:21 PM
నేరాల దర్యాప్తు, పోలీసింగ్‌లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): నేరాల దర్యాప్తు, పోలీసింగ్‌లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) ఆదేశించారు. నేరాల సమీక్షను కేవలం గణాంకాలకే పరిమితం చేయకుండా.. ప్రతి నేరం వెనుక కారణాలు, నేరస్థుల విధానం, దర్యాప్తు తీరు, ఆయా కేసుల పరిష్కారాన్ని సమగ్రంగా విశ్లేషించాలని సూచించారు. అన్ని యూనిట్ల పోలీసు ఉన్నతాధికారులతో ఈరోజు (శుక్రవారం) డీజీపీ కార్యాలయంలో అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని యూనిట్ల పోలీసు అధికారులకు పలు కీలక అంశాలపై డీజీపీ దిశా నిర్దేశం చేశారు.
క్రైమ్ రివ్యూ సమావేశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి..
ఇటీవల సీసీటీఎన్‌ఎస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో గతంలో 70 నుంచి 80 శాతంగా ఉన్న.. సీసీటీఎన్‌ఎస్ డేటా అప్‌డేట్.. అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో 96 శాతానికి చేరడం అభినందనీయమని డీజీపీ పేర్కొన్నారు. ప్రతి నెల నిర్వహించే క్రైమ్ రివ్యూ సమావేశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసులు పాటించాల్సిన ప్రాథమిక విధానాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రొఫెషనల్ స్టాండర్డ్స్‌ను పాటించడాన్ని అధికారులు పోటీగా తీసుకోవాలని సూచించారు.
ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి..
అన్ని జోన్ల డీఐజీలు, మల్టీజోన్ ఐజీలు ఇకపై ఇన్‌స్పెక్షన్ నోట్స్‌ను పరిశీలించాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. ఆయా జిల్లాల పర్యటనలు, పోలీస్‌స్టేషన్ల తనిఖీల సమయంలో గుర్తించే అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. నేరాల ధోరణిని ముందుగానే గుర్తించి, అవసరమైన చోట ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. డీజీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్, సీఐడీ డైరెక్టర్ శిఖా గోయెల్, ఉమెన్ సేఫ్టీ, సీఐడీ డైరెక్టర్ చారు సిన్హా, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా హాజరయ్యారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సైబర్, ఆర్థిక నేరాలు తగ్గాయి..
సాంకేతికతను నేర నియంత్రణకు సాధనంగా వినియోగించాలని డీజీపీ సూచించారు. సైబర్, ఆర్థిక నేరాలు తగ్గాయని అన్నారు. మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టిసారించామని వెల్లడించారు. ఆయా యూనిట్ల వారీగా నెలవారీ సమీక్షలు తప్పనిసరని స్పష్టం చేశారు. బేసిక్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. వృత్తిపరమైన ప్రమాణాలు పాటించాలని మార్గనిర్దేశం చేశారు. అన్ని జోన్ల డీఐజీలు, మల్టీజోన్ ఐజీలు ఇకపై ఇన్‌స్పెక్షన్ నోట్స్‌ను పరిశీలించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో 7.15శాతం నేరాలు పెరిగాయి..
రాష్ట్రంలో 7.15శాతం నేరాలు పెరిగాయని డీజీపీ వెల్లడించారు. మాదకద్రవ్యాల కేసుల్లో 46.10శాతం వృద్ధి సాధించిందని అన్నారు. రాష్ట్రంలో మొత్తం నేరాల సంఖ్య మూడేళ్లలో 7.15 శాతం పెరిగాయని వివరించారు. 2023-24లో 2,65,377 కేసులు నమోదుకాగా.. 2025-26లో 2,84,363కు చేరాయని చెప్పారు. లక్ష జనాభాకు నేరాల రేటు 481.58 నుంచి 491.59కి పెరిగిందని తెలిపారు. మాదకద్రవ్యాల కేసులు 2023-24లో 2,026 ఉండగా.. 2025-26లో 2,960కు చేరాయని ప్రస్తావించారు. మూడేళ్లలో 46.10 శాతం పెరిగాయని వెల్లడించారు. వ్యవస్థీకృత నేరాలు 25 నుంచి 451కు పెరిగి 1,704 శాతం వృద్ధిని నమోదు చేశాయని అన్నారు. ట్రాఫిక్ నేరాలు 29,130 నుంచి 31,891కు పెరిగి 9.48 శాతం వృద్ధి చెందాయన్నారు. మరోవైపు సైబర్ నేరాలు 25,373 నుంచి 22,000కు తగ్గి 13.29 శాతం, ఆర్థిక నేరాలు 37,690 నుంచి 32,684కు తగ్గి 13.28 శాతం క్షీణించాయని చెప్పారు. తీవ్ర నేరాల్లో 10.33% తగ్గాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భారత్ - అమెరికా రక్షణ రంగంలో మరో ముందడుగు
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News