కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
ABN , Publish Date - Aug 28 , 2026 | 02:18 PM
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పందేలు నిర్వహించడం చట్టపరిధిలో పూర్తిగా నిషేధమని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు (Madras High Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ పందేలు నిర్వహించడం చట్టపరిధిలో పూర్తిగా నిషేధమని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. గతంలో అనుమతులిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చట్టపరంగా చెల్లవని జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ వ్యాఖ్యానించారు. కోడిపందేల నిర్వహణ పౌరుల ప్రాథమిక హక్కు కాదని తేల్చిచెప్పారు.
జంతు హింస నిరోధక చట్టం-1960 ప్రకారం కోడిపందేలు తీవ్ర నేరమని జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. 'రిట్ ఆఫ్ మాండమస్' కింద అనుమతులు జారీ చేయలేమని తేల్చిచెప్పారు. కోడిపందేలకు 'సంస్కృతి' హోదా ఇవ్వలేమని పేర్కొన్నారు. సినిమాలు, ఆచారాల్లో ప్రసిద్ధి చెందినంత మాత్రాన ఈ పందేలను సంస్కృతిక క్రీడగా గుర్తించలేమని తెలిపారు. జల్లికట్టు తరహాలో ప్రత్యేక చట్టసవరణ లేనంతవరకు మినహాయింపులు ఇవ్వలేమని స్పష్టం చేశారు.
కత్తులు కట్టకపోయినా పందేలు నేరమేనని చెప్పుకొచ్చారు. కత్తులు లేవనే సాకుతో ఈ పందేలకు అనుమతి కోరిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. జంతు సంక్షేమ చట్టంలో 'పక్షులు' కూడా భాగమేనని స్పష్టం చేశారు. జల్లికట్టు లాగా ప్రత్యేక చట్టసవరణ తీసుకువస్తేనే మినహాయింపు దక్కుతుందని జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ స్పష్టం చేశారు.
గతంలో కోడిపందేలకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ వ్యాఖ్యానించారు. గత తీర్పులను భవిష్యత్తు కేసుల్లో నిదర్శనంగా పరిగణించరాదని తెలిపారు. ఆయా షరతులతో కోడిపందేలకు అనుమతి ఇచ్చిన పాత ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్‌లో కీలక తీర్పు వెల్లడించారు. కత్తులు కట్టకుండా నిర్వహించినా కోడిపందేలకు చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. పక్షులకు గాయాలు కాకుండా చూడాలనే షరతులతో ఇచ్చిన పాత అనుమతులు కూడా చట్టానికి విరుద్ధమేనని తెలిపారు. జంతు హింస నిరోధక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి ఈ పందేలకు అనుమతి ఇవ్వలేమని అన్నారు. కోడిపందేలకు అనుమతి ఇచ్చిన గత డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ‘పూర్తిగా అనవసరం’ అని వ్యాఖ్యానించారు. తంజావూరు జిల్లా కలెక్టర్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌కు మద్రాస్ హైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
ఏపీకి భారీ ప్రాజెక్ట్.. మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా అవతరణ
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News