Share News

హైదరాబాద్ పోలీసులకు స్మార్ట్ ఈవీ వాహనాలను ప్రారంభించిన డీజీపీ ఆనంద్

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:41 PM

హైదరాబాద్ సిటీ పోలీసులకు 15 ఈవీ స్మార్ట్ వాహనాలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ గురువారం పెట్లబురుజు సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. స్పందన బృందాలకు - 7, శాంతిభద్రతల విధులకు - 8 టాటా పంచ్ ఈవీ కార్లను కేటాయించినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ పోలీసులకు స్మార్ట్ ఈవీ వాహనాలను ప్రారంభించిన డీజీపీ ఆనంద్
Telangana DGP CV Anand

హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సిటీ పోలీసులకు 15 ఈవీ స్మార్ట్ వాహనాలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఈరోజు (గురువారం) పెట్లబురుజు సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. స్పందన బృందాలకు - 7, శాంతిభద్రతల విధులకు - 8 టాటా పంచ్ ఈవీ కార్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. టాటా పంచ్ ఈవీ కారుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ వాహనాలు 40 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్నాయని వివరించారు. ఇరుకైన వీధులు, గల్లీల్లోకి సైతం వేగంగా చేరుకునేలా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అమల్లోకి తీసుకువచ్చామని వెల్లడించారు.


సీఎస్సార్ కింద వాహనాలను హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్‌సీ) సమకూర్చిందని డీజీపీ చెప్పారు. డయల్ - 112 కంట్రోల్ రూమ్‌ సమన్వయంతో క్షణాల్లో ఘటనా స్థలానికి స్పందన వాహనాలు చేరుకుంటాయని తెలిపారు. భాగ్యనగరంలోని 7 లా అండ్ ఆర్డర్ జోన్లలో 14 స్పందన బృందాలు విధుల్లో ఉంటాయని అన్నారు. ప్రతి వాహనంలో మహిళా డ్రైవర్, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉంటారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10గంటల నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు రెండు షిఫ్టుల్లో స్పందన సేవలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుందని వివరించారు.


గత 185 రోజుల్లో 8,903 ఫిర్యాదులకు స్పందన బృందాలు స్పందించాయని డీజీపీ చెప్పుకొచ్చారు. 1,900 సమస్యలను కౌన్సెలింగ్ ద్వారా, 1,164 వివాదాలను రాజీతో పరిష్కరించినట్లు వెల్లడించారు. 2,504 కేసులు స్థానిక ఠాణాలకు బదిలీ, 61 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని తెలిపారు. తప్పిపోయిన నలుగురు చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులకు స్పందన బృందాలు అప్పగించాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మహిళా పోలీస్ డ్రైవర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే కొత్త ఈవీ వాహనాలను తీసుకువచ్చామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 08:54 PM