సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:40 PM
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలంగాణ డీజేపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. సైబర్ నేరాలు జరగకముందే అడ్డుకోవాలని పేర్కొన్నారు. సైబర్ నేరాగాళ్లకు చెక్‌పెట్టెలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలంగాణ డీజేపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) వ్యాఖ్యానించారు. సైబర్ నేరాలు జరగకముందే అడ్డుకోవాలని పేర్కొన్నారు. సైబర్ నేరాగాళ్లకు చెక్‌పెట్టెలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈరోజు (మంగళవారం) 14 రాష్ట్రాల సైబర్ పోలీసు అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డీజీపీ కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్ సమావేశంలో డీజీపీ పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర హోంశాఖ సమన్వయంతో TGCSB అధికారులు ఈ సమావేశం నిర్వహించారు.
సైబర్ నేరం వ్యవస్థీకృత నేరంగా మారింది: డీజీపీ
14 రాష్ట్రాల నుంచి 45 మంది పోలీసు, దర్యాప్తు అధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో ED, CBI, RBI, DoT సహా 11 కేంద్ర సంస్థల ప్రతినిధుల పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ఫిర్యాదులు 24 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో మాత్రం సైబర్ నేరాల ఫిర్యాదులు 3 శాతం తగ్గాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వివరించారు. ప్రధాని కార్యాలయం నిర్వహించిన గత రెండు సమీక్షల్లో తెలంగాణకు మొదటి స్థానం వచ్చిందని చెప్పుకొచ్చారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ పనితీరును డీజీపీ సీవీ ఆనంద్ వివరించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. సైబర్ నేరం ఇప్పుడు వ్యవస్థీకృత నేరంగా మారిందని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఏకీకృత చర్యలు అవసరం..
నేరం జరిగిన తర్వాత డబ్బు రికవరీ చేయడం కాదని.. నేరం జరగకముందే అడ్డుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. నేరగాళ్లకు బాధితులు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు అందకుండా చేయాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు దేశవ్యాప్తంగా ఏకీకృత చర్యలు అవసరమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సమావేశంలో వచ్చిన సిఫార్సులను ఢిల్లీకి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరాల నివారణ, అంతర్రాష్ట్ర ముఠాలను కట్టడి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న ఆన్‌లైన్ నేరాలపై నిఘా ఉంచామని పేర్కొన్నారు.
మ్యూల్ బ్యాంకు ఖాతాలను నియంత్రించాలి..
ఏఐ ఆధారిత నేరాల గుర్తింపు, మ్యూల్ బ్యాంకు ఖాతాలను నియంత్రించాలని డీజీపీ సూచించారు. బ్యాంకులు, టెలికాం, డిజిటల్ వేదికల సమన్వయంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరగాళ్లపై ఉమ్మడి అంతర్రాష్ట్ర ఆపరేషన్లు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నోడల్ అధికారులు, ప్రత్యేక ఎస్కలేషన్ ప్రోటోకాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాలపరిమితితో కూడిన కార్యాచరణ కోసం ఓ ప్రణాళికను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. 29 రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే నియంత్రణ
తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. వర్షపాతం లోటు తగ్గిందన్న అధికారులు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News