Share News

పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ ఓవరాల్ ఛాంపియన్: డీజీపీ

ABN , Publish Date - Nov 26 , 2026 | 07:11 PM

పోలీస్ డ్యూటీ మీట్‌ను మరింత పోటీతత్వంతో నిర్వహిస్తామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిందని పేర్కొన్నారు.

పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ ఓవరాల్ ఛాంపియన్: డీజీపీ
Telangana DGP CV Anand

హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పోలీస్ డ్యూటీ మీట్‌ను మరింత పోటీతత్వంతో నిర్వహిస్తామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) వ్యాఖ్యానించారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ పోటీలో పాల్గొని గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు (గురువారం) జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు వేడుకలకు డీజీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిసారి ఈ పోటీలను నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్లు చేసేవాళ్లమని తెలిపారు. కానీ అనివార్య కారణాలతో తక్కువ సమయంలోనే ఈసారి డ్యూటీ మీట్ నిర్వహించామని చెప్పుకొచ్చారు. ఈ పోటీలో కీలకమైన అంశాల్లో పోలీసులు ప్రతిభ కనబరచడం గర్వకారణమని తెలిపారు. 2026 డ్యూటీ మీట్‌లో సుమారు 16 టీములు 421 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని అన్నారు. ఇందులో నాలుగు రోజుల పాటు 21 ఈవెంట్స్ జరిగాయని వెల్లడించారు.


డ్యూటీ మీట్‌లో 63 మంది మెడల్స్ గెలుచుకున్నారు..

రోజు వారి విధుల్లో కీలకమైన వివిధ అంశాల్లో పోలీసులు ప్రతిభ కనబరిచారని డీజీపీ ప్రశంసించారు. డ్యూటీ మీట్‌లో 63 మంది మెడల్స్ గెలుచుకున్నారని.. ఇందులో 21 గోల్డ్ మెడల్స్ ఉన్నాయని తెలిపారు. ఈ పోటీలో ఎస్ఐ ప్రేమ్ సాగర్ ఐదు మెడల్స్ సాధించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు డీజీపీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆల్ ఇండియా జాతీయ డ్యూటీ మీట్‌కు ఇది ప్రిపరేషన్ అని చెప్పుకొచ్చారు. వచ్చే నెలలో ముంబైలో జరిగే ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో ఎస్ఐ ప్రేమ్ సాగర్ మరోసారి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.


నిర్లక్ష్యం చేయొద్దు..

ఈ మధ్య కాలంలో డ్యూటీ మీట్‌ల పట్ల పోలీస్ సిబ్బందికి ఇంట్రెస్ట్ తగ్గుతోందని.. అందుకు అనేక కారణాలు ఉన్నాయని డీజీపీ ఆనంద్ వివరించారు. ఇటీవల సీఆర్పీఎఫ్ బ్యాండ్ కాంపిటీషన్‌కు వెళ్లానని.. పలు రాష్ట్రాల బ్రాస్ బ్యాండ్ టీంలు ఇందులో పాల్గొన్నాయని వెల్లడించారు. బ్రాస్ బ్యాండ్‌లో సిబ్బంది తక్కువ ఉన్న కూడా ఆల్ ఇండియా బ్యాండ్ కాంపిటీషన్‌లో మన పోలీసులు సిల్వర్ మెడల్ కొట్టారని ప్రశంసించారు. మౌంటెడ్ పోలీస్, బ్రాస్ బ్యాండ్, డ్యూటీ మీట్, స్పోర్ట్ మీట్‌లు ఇవన్నీ మన ప్రతిష్ఠ అని చెప్పుకొచ్చారు. డ్యూటీ మీట్ స్పోర్ట్ మీట్ టైమ్ వేస్ట్ అనే ధోరణి సిబ్బందిలో మారాలని... పోలీసు శాఖ ప్రతిష్ఠ పెంచే ఏ అంశాల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు.


రివార్డులు ఇవ్వాలి..

ఆల్ ఇండియా డ్యూటీ మీట్‌లో పాల్గొని గెలిచిన వారికి రివార్డ్ రాలేదని కొంతమంది చెబుతున్నారని డీజీపీ ఆనంద్ అన్నారు. ప్రభుత్వం రివార్డులు ఇవ్వకపోయినా మన వెల్ఫేర్ నుంచి అయిన మనం వారికి రివార్డులు ఇవ్వాలని సూచించారు. గత సంవత్సరం ఎవరికైతే రివార్డ్ అమౌంట్ రాలేదో సమీక్ష చేసి ఇస్తామని మాటిచ్చారు. ఇంకా కొన్ని రేంజ్‌లను కలిపి మరింత కాంపిటీటివ్‌గా డ్యూటీ మీట్‌ నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది నుంచి నెల రోజుల ముందుగానే ప్రిపరేషన్‌తో డ్యూటీ మీట్ నిర్వహిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఖేలో ఇండియా గేమ్స్.. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: సీఎం రేవంత్‌రెడ్డి

టెక్నాలజీతో పోలీస్ సేవలు మరింత వేగవంతం: డీజీపీ

నాగర్ కర్నూల్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వరాలు.. రూ.450 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 09:26 PM