ఖేలో ఇండియా గేమ్స్.. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:25 PM
ఖేలో ఇండియా క్రీడా పోటీలకు వచ్చే ఆహ్వానితులు, క్రీడాకారులకు అందించే ఆహారం, అకామిడేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్టేడియంల పునరుద్ధరణతో పాటు ఏర్పాట్లలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఖేలో ఇండియా క్రీడా పోటీలకు వచ్చే ఆహ్వానితులు, క్రీడాకారులకు అందించే ఆహారం, అకామిడేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. స్టేడియంల పునరుద్ధరణతో పాటు ఏర్పాట్లలో నాణ్యత విషయంలో రాజీపడొద్దని స్పష్టం చేశారు. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి మెరుగైన శిక్షణ అందించేందుకు దేశంలో బెస్ట్ కోచ్‌లను నియమించాలని సూచించారు.
ఈరోజు (బుధవారం) ఎంసీహెచ్ఆర్డీలో (MCRHRD) ఖేలో ఇండియా పోటీల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, క్రీడా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సలహాదారు కే. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణి ప్రసాద్, మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాల దేవి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులతో కీలక అంశాలపై చర్చించారు. ఖేలో ఇండియా పోటీల ఏర్పాట్లపై అధికారులకు సీఎం పలు కీలక సూచనలు చేశారు.
క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలి..
డిసెంబరు 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఖేలో ఇండియా పోటీలను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. డిసెంబరు 11వ తేదీన అట్టహాసంగా ఖేలో ఇండియా పోటీలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు, గచ్చిబౌలిలో ముగింపు వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. భాగ్యనగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. పోలీస్, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేయాలని ఆజ్ఞాపించారు. ఈ గేమ్స్ ఏర్పాట్లకు సంబంధించి ఒక్కో విభాగానికి ఒక్కొక్కరిని ఇన్‌చార్జ్‌లుగా నియమించి బాధ్యులను చేయాలని సూచించారు.
మంత్రులకు బాధ్యతలు..
ఈ పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లాలవారీగా మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఇన్చార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. మహబూబ్‌నగర్ పరిధిలో జూపల్లి కృష్ణారావు, వరంగల్ పరిధిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ పరిధిలో అడ్లూరి లక్ష్మణ్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. ఖమ్మం పరిధిలో తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ పరిధిలో సుదర్శన్ రెడ్డిని ఈ పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణకు బాధ్యతలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మూసీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి.. అధికారులకు సీఎం ఆదేశం
మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి కానుక.. కోటి ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం
హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి పాదయాత్ర.. 20 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News