Share News

మూసీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి.. అధికారులకు సీఎం ఆదేశం

ABN , Publish Date - Nov 24 , 2026 | 09:06 PM

మూసీ ప్రాజెక్టు పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

మూసీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి.. అధికారులకు సీఎం ఆదేశం
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మూసీ ప్రాజెక్టు పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు (మంగళవారం) ఎంసీహెచ్‌ఆర్డీలో (MCRHRD) మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతి, పట్టణాభివృద్ధిపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఫేజ్-1 పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1 ఏ గా, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1 బీ గా విభజించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. జనవరి 2027లో ఫేజ్-1 పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు.


మిరాలం చెరువు అభివృద్ధిపై చర్చ..

ఇప్పటికే ఫేజ్-1 టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. జనవరి 2028 నాటికి దీనిని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు సీఎంకు అధికారులు వివరణ ఇచ్చారు. మిరాలం చెరువు అభివృద్ధితో పాటు చెరువులో ఎంతోకాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని అధికారులను ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనుల పురోగతి పనులను కూడా అధికారులు వెల్లడించారు. మార్చి 2027 నాటికి పనులు పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు.


అలాగే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధిపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎంసీ కమిషనర్ శ్రీజన, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి, MRDCL ఎండీ నర్సింహా రెడ్డి, HGCL ఎండీ ఉపేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 09:19 PM