పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:43 PM
పార్టీ ఫిరాయింపుల చట్టం సంస్కరణలపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి న్యాయస్థానం నోటీసులను జారీచేసింది.
ఢిల్లీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపుల చట్టం సంస్కరణలపై సుప్రీంకోర్టులో (Supreme Court) ఈరోజు (సోమవారం) విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి న్యాయస్థానం నోటీసులను జారీచేసింది. కేంద్ర న్యాయశాఖ, పార్లమెంటరీ అఫైర్స్ మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టం, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ ఎ. సేతు తరఫున న్యాయవాదులు ఆర్. సతీశ్ కుమార్, జతిన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎన్నికైన ప్రతినిధులు అనర్హత కేసులను తప్పించుకోవడానికి వ్యూహాత్మక రాజీనామాలు చేస్తున్నారని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అనర్హత విచారణ పెండింగ్‌లో ఉన్నప్పుడు లేదా రాబోతున్నప్పుడు రాజీనామా చేసి, పదో షెడ్యూల్ నిబంధనలను తప్పించుకోవడం, రాజకీయ పునర్‌వ్యవస్థీకరణలకు దారితీయడం, అసెంబ్లీల సంఖ్యాబలాన్ని మార్చడం జరుగుతోందని పిటిషనర్ తెలిపారు.
పిటిషనర్ అభ్యర్థనలివే..
అనర్హత కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు రాజీనామా చేసినా, ఆ కేసులు ముగియకూడదని పిటిషనర్ పేర్కొన్నారు. స్పీకర్/ఛైర్మన్ రాజీనామాను స్వచ్ఛందంగా, నిజమైనదేనా అని ఆధారాలతో పరిశీలించి, కారణాలతో కూడిన ఉత్తర్వు ఇవ్వాలని కోరారు. రాజీనామాలు, అనర్హత కేసులపై సమయబద్ధంగా, పారదర్శకంగా, కారణాలతో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్పీకర్ - కేంద్రీకృత విచారణ వ్యవస్థపై సంస్థాగత సమీక్ష జరపాలని పిటిషనర్ కోరారు. హంగ్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు ఉన్న మెజారిటీని అసెంబ్లీలోనే (సభ్యులు ఆర్టికల్ 188 కింద ప్రమాణస్వీకారం చేసిన తర్వాత) పరీక్షించాలని విన్నవించారు. అనర్హత విచారణ పెండింగ్‌లో ఉన్నప్పుడు రాజీనామా చేసినా అనర్హత విచారణను రద్దు చేయకూడదని కోరారు. స్పీకర్ ఈ రెండింటిపైనా రాజీనామా, అనర్హత కారణాలతో ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News