Share News

అటూ.. ఇటూ.. నేతల రాత?

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:38 AM

నియోజకవర్గాల పునర్విభజనకు జరుగుతున్న ప్రయత్నాలు.. కొత్తగా రాజకీయ ప్రవేశం చేయాలన్న కొందరి ఆశలకు ఊపిరులూదుతుంటే.. ఇప్పటికే పాతుకుపోయిన నేతల్లో ఆందోళన రేపుతున్నాయి.

అటూ..  ఇటూ.. నేతల రాత?

  • పెరగనున్న సీట్లతో యువతకు చాన్స్‌..

  • పాత నేతలకు హద్దుల గండం

  • రిజర్వేషన్లతో స్థానాలు గల్లంతవుతాయని సీనియర్‌ నేతల్లో భయం

  • 2008 డీలిమిటేషన్‌లో మహిళా రిజర్వేషన్లు లేకున్నా మారిన రాతలు

  • తుమ్మల, సబిత, ఎర్రబెల్లి, గీతారెడ్డి సీట్లు గల్లంతు.. కొత్త స్థానాల నుంచి పోటీ

  • ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీరా కూడా..

  • ఐదుసార్లు గెలిచిన కృష్ణబాబుకు సీటే లేని పరిస్థితి..

  • వేం నరేందర్‌రెడ్డికి అవకాశం పోయిందీ అప్పుడే..

  • భట్టికి కలిసొచ్చిన నాటి డీలిమిటేషన్‌..

  • పెంపుతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు రిలీఫ్‌

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజనకు జరుగుతున్న ప్రయత్నాలు.. కొత్తగా రాజకీయ ప్రవేశం చేయాలన్న కొందరి ఆశలకు ఊపిరులూదుతుంటే.. ఇప్పటికే పాతుకుపోయిన నేతల్లో ఆందోళన రేపుతున్నాయి. రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే కొత్త తరానికి అవకాశాలు దక్కనుండగా.. మహిళా రిజర్వేషన్లు, సరిహద్దుల మార్పుతో ఇప్పటికే ఉన్న నేతలకు కొత్త చిక్కులు ఎదురుకానున్నాయి. నియోజకవర్గాలను కంచుకోటలుగా మార్చుకున్న నేతల స్థానాలు గల్లంతై.. వారి తలరాతలే మారిపోయే అవకాశాలున్నాయి. 2008లో నియోజకవర్గాల పునర్విభజన కేవలం సరిహద్దుల మార్పు, రిజర్వుడు స్థానాల మార్పిడికే పరిమితమైనా.. ఎంతో మంది నేతల తమ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. కొందరికైతే ఆ తరువాత నుంచి పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈసారి నియోజకవర్గాల సరిహద్దులు, రిజర్వుడు స్థానాల మార్పిడితోపాటు 50 శాతం స్థానాల పెంపు, మూడో వంతు మహిళా రిజర్వేషన్లు కూడా తోడు కానున్నాయి.


దీంతో ఈ ప్రభావం సీనియర్‌ నేతలపై పడుతుందన్న ఆందోళన నెలకొంది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉన్నప్పుడు జరిగిన పునర్విభజన ప్రభావం చాలామంది నేతలపై పడింది. తెలంగాణ ప్రాంతంలో సీనియర్‌ నేతలైన గీతారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి వారు కొత్త అసెంబ్లీ స్థానాలను వెతుక్కోవాల్సి వచ్చింది. అప్పుడు రాష్ట్ర మంత్రిగా జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహ్మద్‌ ఫరీదుద్దీన్‌.. ఆ స్థానం రిజర్వు కావడంతో అంబర్‌పేట నుంచి పోటీ చేయాల్సివచ్చింది. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ తరువాత ఇక ఆయనకు సీటే లేకుండా పోయింది. కాగా, ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుస్తూ వచ్చిన వేణుగోపాలాచారికీ ఇదే పరిస్థితి ఎదురైంది.


నియోజకవర్గం మారి బరిలోకి..

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహించిన చలకుర్తి నియోజకవర్గం నాగార్జునసాగర్‌గా, ఈటల రాజేందర్‌ స్థానం కమలాపూర్‌ రద్దయి హుజూరాబాద్‌గా, కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించిన శాయంపేట రద్దయి పరకాలగా ఏర్పడి హద్దులు కూడా మారిపోయాయి. ఇక ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన హిమాయత్‌నగర్‌ స్థానం రద్దవడంతో ఆయన అంబర్‌పేట నుంచి పోటీ చేయాల్సివచ్చింది. పునర్విభజనలో భాగంగా కొత్త నియోజకవర్గాలకు వెళ్లి పోటీ చేసిన నేతల్లో కొందరు విజయం సాఽధించగా, మరికొందరు ఓడిపోయారు. కొందరికైతే అసలు ప్రత్యక్ష రాజకీయాలకు అవకాశమే లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీరారెడ్డి లాంటివారు సీట్లు మారి గెలవగా, కొవ్వూరు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దివంగత పెండ్యాల కృష్ణబాబుకు మరో స్థానమే లేకుండా పోయింది. అప్పట్లో ఫ్యాక్షనిస్టుగా గుర్తింపు పొందిన చల్లా రామకృష్ణారెడ్డి కోయిలకుంట్ల (కర్నూలు జిల్లా) నుంచి మూడుసార్లు వ రుసగా గెలిచారు. 2008లో ఆ స్థానం రద్దయి, పరిధిలో మార్పులు జరిగి.. బనగానపల్లిగా మారింది. అక్కడి నుంచి ఆయన 2009లో పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేదు.


తెలంగాణలో పెనుమార్పులకు అవకాశం..

తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న తొలి డీలిమిటేషన్‌ ఇది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. డీలిమిటేషన్‌లో భాగంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు మారనుండడం, దాంతోపాటు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానుండడంతో సీట్ల పెంపు, భౌగోళిక హద్దుల మార్పు ఉంటుంది. ఇవన్నీ కలిపితే కొత్తవారికి అవకాశాలు ఎంత మేర దక్కుతాయో.. ఉన్నవారికి అంతేస్థాయిలో గుబులు పుట్టించడం ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాజకీయాల్లో కొత్త తరం ప్రవేశం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది.


తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పూర్తిస్థాయిలో, ఆ తర్వాత కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినప్పుడు కొంతమేరకు చూశాం. ఇప్పుడు డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదం పొంది.. సీట్లు పెరిగితే కూడా మళ్లీ అలాంటి కొత్తగాలి వీచే అవకాశం ఉంది. డీలిమిటేషన్‌తో తెలంగాణలో ఇప్పుడున్న 119 స్థానాలు 182కు పెరుగుతాయనే అంచనా ఉంది. ఈ స్థానాల సంఖ్య కొంత అటు ఇటు అయినా.. మొత్తంగా మాత్రం 50 శాతం సీట్లు పెరుగుతాయి. అంటే ఆ మేరకు కొత్తవారికి అవకాశాలు లభిస్తాయి. అందులో భాగంగా ఇప్పటికే పార్టీల్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నవారు, ఎంపీపీలు, జడ్పీటీసీలు లాంటి పదవుల్లో ఉన్నవారు, సమాజంలో మంచిపేరు తెచ్చుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించి అవకాశం కోసం ఎదురుచూస్తున్నవారు, ఎన్‌ఆర్‌ఐలు.. ఇలా పలు రంగాల వారికి కొత్తగా అవకాశాలు దక్కుతాయి.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు రిలీఫ్‌.. బీజేపీకి అన్వేషణే

రాష్ట్రంలో సీట్లు పెరిగితే.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు కొంత టెన్షన్‌ తగ్గే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌ పార్టీ డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకించినా.. అది ఆమోదం పొందితే పెరిగే స్థానాలు ఆ పార్టీకి కలిసివస్తాయి. అధికార పార్టీ కావడంతో సీట్ల కోసం పోటీపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీరందరికీ ఇప్పుడున్న పరిమిత సంఖ్యలో సీట్లను సర్దుబాటు చేయడం తలనొప్పి అవుతుంది. ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో నాయకులెక్కువ.. సీట్లు తక్కువ అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. పార్టీ టికెట్‌ దక్కించుకున్న వారికి వ్యతిరేకంగా దక్కనివారి తిరుగుబాట్లు, వెన్నుపోట్లు ఉండనే ఉంటాయి.


మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లోనూ ఇదే పరిస్థితి. పలు జిల్లాల్లో ఆ పార్టీకి నేతలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నా అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు సీట్ల సంఖ్య పెరిగితే ఈ సమస్య తీరుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలకు సీట్ల కేటాయింపులో ఎదురయ్యే ఒత్తిడి తగ్గుతుంది. అయితే బీజేపీకి మాత్రం నేతలను వెతుక్కోవాల్సిన పరిస్థితే రానుంది. ఇప్పటికైతే రాష్ట్రంలో ఆ పార్టీకి బలమైన నేతలు అన్ని నియోజకవర్గాల్లో లేరు. డీలిమిటేషన్‌ బిల్లును పట్టుబట్టి గట్టెక్కించే పనిలో ఉన్న ఆ పార్టీకి.. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే నేతల లోటు మరింత ఉంటుందనే అంచనాలో ఆ పార్టీ అగ్రనేతలే ఉన్నారు. అయితే అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్‌ నుంచి తమ పార్టీలోకి చేరే నేతలకు సీట్ల కేటాయింపు విషయంలో ఇబ్బంది ఉండకుండా సీట్ల పెంపు ఉపకరిస్తుందని ఆ నేతలు చెబుతున్నారు.


రిజర్వేషన్లతో ఎవరి సీటు ఏమవునో!

నియోజకవర్గాల పునర్విభజనతో ఇప్పటికే ఉన్న నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలుగా ఉన్న నేతలకు షాక్‌ తగిలే అవకాశాలూ ఉన్నాయి. తమ సీట్లు ఏ రిజర్వేషన్‌ కింద రిజర్వు అయిపోతాయో అన్న గుబులు వారిలో ఉంది. 2008లో కేవలం భౌగోళిక సరిహద్దులు, ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాల మార్పు, ఆ రిజర్వేషన్‌ స్థానాల పెంపుతోనే అనేక మంది ఉద్ధండులు కొత్త స్థానాలకు వెళ్లాల్సి వచ్చింది. పలువురు ఇలా వెళ్లి గెలవగలిగారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తాను తొలినుంచీ ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి నుంచి ఖమ్మం నియోజకవర్గానికి మారాల్సి వచ్చింది. ఎర్రబెల్లి దయాకర్‌రావు మూడుసార్లు గెలిచిన వర్ధన్నపేట రిజర్వు కావడంతో పాలకుర్తికి మారారు. దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తుంగతుర్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. డీలిమిటేషన్‌లో ఆ స్థానం ఎస్సీకి రిజర్వు కావడంతో సూర్యాపేటకు మారి.. ఒక్కసారి మాత్రమే గెలుపొందారు. మరోవైపు రిజర్వుడు సీటుగా ఉన్న గజ్వేల్‌ నియోజకవర్గం జనరల్‌ కావడంతో అక్కడ అనేకసార్లు గెలిచిన మాజీ మంత్రి గీతారెడ్డి జహీరాబాద్‌కు మారాల్సివచ్చింది. ఇక జనరల్‌ స్థానంగా మారిన గజ్వేల్‌ నుంచే బీఆర్‌ఎస్‌ అధినేత, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


వేం నరేందర్‌రెడ్డికి చాన్స్‌ మిస్సయింది అలాగే..

ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్‌రెడ్డి 2004లో మహబూబాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ఆ స్థానంపై గట్టి పట్టు ఉండేది. అయితే 2008 డీలిమిటేషన్‌లో అది ఎస్టీ రిజర్వుడుగా మారాక.. ఆయనకు మళ్లీ అలాంటి పట్టున్న స్థానం లభించలేదు. తర్వాత వరంగల్‌ వెస్ట్‌ నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. ఆపై ఆయనకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్కకు 2008 డీలిమిటేషనే అవకాశం కల్పించింది. అప్పటివరకు జనరల్‌ కోటాలో ఉన్న మధిర అసెంబ్లీ స్థానం.. డీలిమిటేషన్‌లో రిజర్వు కావడంతో భట్టివిక్రమార్కకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తొలిసారి అవకాశం దక్కింది. అక్కడి నుంచి ఆయన పలుమార్లు విజయం సాధించారు. పరిమిత స్థాయిలో జరిగిన డీలిమిటేషన్‌లోనే పలువురు నేతలు ఇలా కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరికి కలిసిరాగా, మరికొందరికి ఇబ్బందిగా మారి రాజకీయ అవకాశాలకే పూర్తిగా గండికొట్టింది. కానీ ఇప్పుడు జరిగేది పూర్తిస్థాయి పునర్‌వ్యవస్థీకరణ. గతానికి భిన్నంగా ఈసారి మూడోవంతు మహిళా రిజర్వేషన్లు కూడా ఉంటాయి. ఏ సీటు మహిళలకు రిజర్వు అవుతుందో, ఏ సీటు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అవుతుందో...ఎవరెవరు ఎలా తారుమారు అవుతారో, ఎలాంటి రాజకీయ మార్పులకు వేదిక అవుతుందో చూడాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 03:42 AM