Share News

2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jul 30 , 2026 | 02:33 PM

విద్యావ్యవస్థ రాష్ట్రంలో బలపడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాల‌తో కూడిన విద్యా వ్యవస్థ ఉండాల‌నేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం  రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, జులై 30 (ఆంధ్రజ్యోతి): విద్యావ్యవస్థ రాష్ట్రంలో బలపడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాల‌తో కూడిన విద్యావ్యవస్థ ఉండాల‌నేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం) ఎంసీహెచ్‌ఆర్డీ(MCRHRD)లో ఫిన్‌లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వ‌చ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌‌చేంజ్’ కార్యక్రమంలో భాగంగా ఫిన్‌లాండ్, జర్మనీ దేశాల్లో ఉపాధ్యాయుల బృందం పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.


రెసిడెన్షియల్ స్కూళ్లకు పీవీ శ్రీకారం చుట్టారు..

జవాహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావు వేసిన పునాదులతో ఇప్పుడు మన దేశంలో లైఫ్‌స్పాన్ పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రెసిడెన్షియల్ స్కూళ్లకు పీవీ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇక్కడి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని చెప్పారు. విద్యలో నాణ్యత పెరగాలని, పిల్లలకు పౌష్టికాహారం అందాలని సూచించారు. తెలంగాణలో తనకు తెలిసిన మేధావులు ఇద్దరేనని.. వారిలో కేకే, జైపాల్‌రెడ్డి అని అభివర్ణించారు. విద్య విషయంలో బాధ్యత తీసుకోవాలని కేకేను అడిగానని చెప్పుకొచ్చారు. ఆయన సలహాదారుగా అనేక సూచనలు చేస్తున్నారని తెలిపారు. వెనకబాటుతనానికి కారణం చదువులేకపోవడమేనని చెప్పుకొచ్చారు. చదువుకున్న ఎస్సీలు సమాజంలో మంచి స్థానంలో ఉన్నారని వివరించారు. ఆస్తులున్నా.. చదువు లేకపోతే సమాజంలో వెనకపడిపోతున్నారని వెల్లడించారు. విద్యార్థులను సమాజంలో గొప్పగా నిలబెట్టగలిగిన శక్తి ఉపాధ్యాయులకు ఉందని కొనియాడారు. ప్రతీ విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు తాము చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.


ప్రపంచంతో పోటీ పడాలంటే ఈ విద్యా నాణ్యత సరిపోదు..

పీవీ నర్సింహారావు రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సర్వేల్‌లో ఆ స్కూల్లోనే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చదువుకున్నారని ప్రస్తావించారు. నవోదయకు స్పూర్తి సర్వేల్ గురుకులమని చెప్పుకొచ్చారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఈ విద్యా నాణ్యత సరిపోదని అభిప్రాయపడ్డారు. ప్రపంచం ఇంకా మెరుగైన నాణ్యమైన విద్య ఆశిస్తుందని తెలిపారు. నేర్చుకోవడమే కాదని.. నేర్చుకున్న వాళ్లతో ఇక్కడి విద్యార్థులు పోటీ పడాలని అన్నారు. జర్మన్, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశలతో ఇక్కడి విద్యార్థులు పోటీ పడాలని సూచించారు. బదిలీలు, ప్రమోషన్లు అన్నీ అడగకుండానే తాము ఇచ్చామని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల సమస్యలు తనకు వదిలేయాలని అన్నారు. వారి సమస్యలను తాను పరిష్కరిస్తానని మాటిచ్చారు. 2023 వరకు ఒకటో తేదీనే జీతాలు పడ్డాయా? అని ప్రశ్నించారు. ఈ మూడేళ్లు తెలంగాణను సక్రమంగానే నడిపించానని స్పష్టం చేశారు. ఎక్కడా ఆగం కాలేదని.. కలగాపులగం చేయలేదని తెలిపారు. ప్రతి విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. 2014-23 మధ్య డ్రాపౌట్స్‌ పెరిగాయని వివరించారు. 2023-26 వరకు డ్రాపౌట్స్‌ తగ్గి అడ్మిషన్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. విద్యాశాఖలో తాము తెచ్చిన సంస్కరణలే ఇందుకు కారణమని వెల్లడించారు. క్రమశిక్షణ లేకపోతే ఎంత తెలివి ఉన్నా పనికిరారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి: భట్టి విక్రమార్క

హైడ్రాపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 03:03 PM