Share News

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Jun 25 , 2026 | 01:55 PM

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు వలసల గురించి తనకు అవగాహన ఉందని తెలిపారు.

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం రేవంత్ రెడ్డి
Telangana CM Revanth Reddy

ఇంటర్నెట్ డెస్క్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. పాలమూరు వలసల గురించి తనకు అవగాహన ఉందని తెలిపారు. మూడు రాష్ట్రాల కరువు జిల్లాలకు ఇది పరిష్కారం చూపబోతోందని పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లు ప్రారంభించారు. కర్ణాటక కొప్పల్ జిల్లా మునీరాబాద్ బహిరంగ సభలో సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. కర్నూలు, అనంతపురం రైతుల సమస్యలు తనకు తెలుసు అని చెప్పుకొచ్చారు.


కష్టాలు, సమస్యలు తెలిసిన నాయకుడు చంద్రబాబు..

మనందరి కష్టాలు, సమస్యలు తెలిసిన నాయకుడు చంద్రబాబు అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. మూడు రాష్ట్రాల మధ్య నీటి సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయని తెలిపారు. నీటి సమస్యలు పరిష్కరించుకోకపోవడంతో నీరు సముద్రం పాలవుతోందని చెప్పారు. మూడు రాష్ట్రాల మధ్య నీటి చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని అన్నారు. తుంగభద్ర నుంచి 10 టీఎంసీల నీరు తమకు రావడం లేదని చెప్పారు. RDS కింద రైతులకు న్యాయం జరగాలని తాము ఆశిస్తున్నామని అన్నారు. చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని తెలిపారు. తమకు పంచాయితీలు వద్దని.. పరిష్కారం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


రైతుల సమస్యకు తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పరిష్కారం..

రాయలసీమ, తెలంగాణలోని లక్షలాదిమంది రైతుల సమస్యకు తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పరిష్కారామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నీటి సమస్యను పరిష్కరించకపోవడంతోనే పాలమూరు వాసులు వలసలు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. నీటి సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయని.. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించామని తెలిపారు. తుంగభద్రలో పూడికతీతకు సంబంధించిన వ్యవహారంపై కేంద్రమంత్రితో చర్చించామని అన్నారు. తుంగభద్ర నది ఒడ్డున జరిగిన చర్చలు అంతరాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతాయని తెలిపారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక నీటి సమస్యను సీఆర్‌ పాటిల్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు. ఆయన ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారనే నమ్మకం తమకు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


6 నెలల్లో 33 గేట్ల పునరుద్ధరించాం: సీఎం చంద్రబాబు

రాయలసీమలోని పలు ప్రాంతాలకు సాగునీరు.. మరికొన్ని ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు తుంగభద్ర అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశంలో నదుల అనుసంధానం తన కలల ప్రాజెక్టు అని ఉద్ఘాటించారు. గంగా, గోదావరి, కావేరి నదుల అనుసంధానం జరగాలని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ 70 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాజెక్టు అని తెలిపారు. తుంగభద్ర తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. అందరూ రైతులకూ నమస్కారాలు అంటూ సీఎం చంద్రబాబు కన్నడలో ప్రసంగించారు. ప్రాజెక్టు నిర్వహణ బాగుంటేనే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతోందని చెప్పారు. 6 నెలల్లో తుంగభద్ర ప్రాజెక్టు 33 గేట్ల పునరుద్ధరించామని వివరించారు. తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలని 1983లో నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. నీటి సమస్యల పరిష్కారానికి కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇవాళ ముగ్గురు సీఎంలు కలవడం చరిత్రాత్మకమని చెప్పుకొచ్చారు. ఎల్‌నినో వల్ల కొన్ని ప్రాంతాల్లో కరవు సమస్య ఉందని తెలిపారు. నీరు ఉంటేనే చరిత్ర, నాగరికత అని.. ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని సీఎం చంద్రబాబు అభివర్ణించారు.


ముగ్గురం సీఎంలు కలిసి చరిత్ర సృష్టిస్తాం: డీకే శివకుమార్

కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో చరిత్రాత్మక తీర్మానం చేశామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. మూడు రాష్ట్రాల రైతుల కోసం తీసుకున్న నిర్ణయం ఓ చరిత్ర అని తెలిపారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, తాను చరిత్ర సృష్టిస్తామని చెప్పారు. అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. మూడు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 02:36 PM