తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సీఎం సాకుకూలం.!
ABN , Publish Date - Oct 26 , 2026 | 02:19 PM
ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ వివాదాన్ని పరిష్కరించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ వివాదాన్ని పరిష్కరించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిరంతర ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు (సోమవారం) ముంబైలోని సహ్యాద్రి రాష్ట్ర అతిథి గృహంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు, అధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి డిజైన్‌పై చర్చించారు.
152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలనే తెలంగాణ ప్రతిపాదనపై చర్చించారు. 152 మీటర్ల ఎత్తులో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనం, ముంపును వివరాలతో సహా సీఎం రేవంత్‌రెడ్డి నివేదించారు. పరిహారం, పునరావాసంపై అధికారుల నివేదిక గురించి మహారాష్ట్ర సీఎంకు వివరించారు. 148 మీటర్ల ఒప్పందాన్ని పరిశీలించేందుకు సిద్ధమని ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్రకు నష్టం లేకపోతే తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపు అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.
గ్రావిటీ ద్వారా నీటి తరలింపునకు 152 మీటర్ల ఎత్తు అవసరమని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ముంపు భూములకు మహారాష్ట్ర నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ గిరిజనుల సాగు, తాగునీటి అవసరాలను వివరించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై అధ్యయనానికి అధికారుల కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అధికారుల అధ్యయనం తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఫడ్నవీస్‌ను రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణిని మరింత బలోపేతం చేస్తాం: భట్టి విక్రమార్క
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోంది: ఎంపీ రఘునందన్
ఎల్‌నినో ప్రభావంతో ఎండలు 50 డిగ్రీలకు చేరే అవకాశం: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News