ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు
ABN , Publish Date - Jan 29 , 2026 | 01:30 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాస సిబ్బందికి నోటీసులు అందజేసింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారంలో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు(KCR) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి.. ఆయన ఇంట్లో లేనందున అక్కడి సిబ్బందికి నోటీసులు అందజేశారు. సెక్షన్ సీఆర్పీసీ 160 కింద ఈ నోటీసులు కేసీఆర్‌కు జారీ చేశారు. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
సిట్ కార్యాలయంలో ఉన్నత స్థాయి భేటీ..
మరోవైపు కేసీఆర్ విచారణకు సంబంధించి సిట్ కార్యాలయంలో అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ విచారణలో అడగాల్సిన ప్రశ్నల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ ప్రక్రియను ఎక్కడ నిర్వహించాలి(ఆయన నివాసంలోనా? లేదా సిట్ ఆఫీసులోనా?) అనే అంశాలపై అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతా పరమైన చర్యలు, చట్టపరమైన నిబంధనలపై సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యం..
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై సిట్ అధికారులు ఈ విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు అరెస్టై రిమాండ్‌లో ఉన్నారు. వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్‌కు నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
తదుపరి పరిణామాలు..
శుక్రవారం మధ్యాహ్నం జరగబోయే విచారణకు కేసీఆర్ స్వయంగా హాజరవుతారా? లేక తన న్యాయవాదుల ద్వారా వివరణ ఇస్తారా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి...
హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అతివేగంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
Read Latest Telangana News And Telugu News