Share News

ఘాటెక్కిన ఉల్లి.. నెల రోజుల్లోనే ఆకాశాన్నంటిన ధరలు

ABN , Publish Date - Sep 04 , 2026 | 09:34 AM

ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను కుదిపేస్తున్నాయి.

ఘాటెక్కిన ఉల్లి.. నెల రోజుల్లోనే ఆకాశాన్నంటిన ధరలు
onion prices in Hyderabad

  • అదే దారిలో అల్లం, వెల్లుల్లి

  • మలక్‌పేట మార్కెట్‌లో క్వింటాల్‌ ఉల్లి రూ. 5వేలు

హైదరాబాద్: ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను కుదిపేస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు, దిగుబడులు తగ్గడంతో మార్కెట్‌లో వాటి ధరలు ఘాటెక్కాయి. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు రెట్టింపు కావడం వినియోగదారులకు కంటతడి పెట్టిస్తుండగా.. గిట్టుబాటు ధర దక్కుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో హైదరాబాద్‌ మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో మహారాష్ట్ట్ర ఉల్లి క్వింటాల్‌ ధర రూ.2వేలు ఉండగా, నెల రోజుల్లో ఏకంగా రూ. 3వేలు పెరిగి గురువారం నాటికి రూ.5వేల మార్కును తాకింది.


city5.jpgమహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లి రకానికి ఏడాది కాలంలో ఇదే గరిష్ఠ ధర అని రైతులు చెబుతున్నారు. గతంలో గిట్టుబాటు ధరల్లేక పంటను రోడ్లపై పారబోసిన రైతులకు ఈ ధరలు ఊరటనిస్తున్నప్పటికీ, సామాన్యుడి జేబుకు మాత్రం తూట్లు పొడుస్తున్నాయి. ఉల్లి బాటలోనే అల్లం,వెల్లుల్లి ధరలు కూడా భారీగా పెరిగాయి. మలక్‌పేట మార్కెట్‌కు కర్ణాటక నుంచి వచ్చిన అల్లం క్వింటాల్‌ రూ.16,000.. జహీరాబాద్‌, కోహీర్‌ ప్రాంతాల నుంచి వచ్చిన అల్లం రూ.11,000 పలికింది. మధ్యప్రదేశ్‌ నుంచి దిగుమతి అయిన వెల్లుల్లి రూ.19,000 అమ్ముడుపోయింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో వెల్లుల్లి ధర రూ.250 దాటింది.


city5.2.jpgవర్షాభావ పరిస్థితులే కారణం?

వర్షాభావ పరిస్థితులతో పంట సాగు విస్తీర్ణం తగ్గడమే ఈ ధరల మంటకు ప్రధాన కారణమని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు. ఉల్లి పచ్చి పంట కావడం నిల్వ చేసే విధానంపై రైతులు ఆసక్తి చూపకపోవడం కూడా ధర పెరగడానికి మరో కారణంగా భావిస్తున్నారు. మహారాష్ట్రలో గత జూన్‌, జూలై నెలలో భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినగా.. కర్ణాటక, కర్నూలు, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక సాగు గణనీయంగా తగ్గింది. ఫలితంగా మలక్‌పేట్‌ మార్కెట్‌ రోజూ రావాల్సిన 20వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతి ప్రస్తుతం 5వేల క్వింటాళ్లకు పడిపోయింది. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో కొత్త పంట మార్కెట్‌కు వచ్చే వరకు ధరల భారం తప్పదని మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి చిలక నర్సింహారెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 09:34 AM