Share News

పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:55 AM

‘పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకు ఉంది’’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని గురువారం తప్పించింది.

పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది
Chinnareddy

త్వరలోనే వివరాలు చెప్తా: చిన్నారెడ్డి

క్యాంపు కార్యాలయానికి మా కార్యకర్తలను

రావొద్దన్నారనే గోపాల్‌పేటలో మాట్లాడా: జి. చిన్నారెడ్డి

వనపర్తి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకు ఉంది’’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని గురువారం తప్పించింది. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం జయన్న తిరుమలాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రానికి గురువారం వెళ్లిన చిన్నారెడ్డి.. తన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. తనకు పదవులపై వ్యామోహం లేదని, తాను ఎక్కడికి వెళ్లినా తనపై ఉన్న గౌరవంతో అధికారులు పనులు చేసి పెడతారని చిన్నారెడ్డి తెలిపారు. పదవిలో ఉన్నప్పుడే ప్రోటోకాల్‌ను వదులుకున్నానని పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చిన సమయంలో తాను ఎవరినీ కలవలేదని, ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లండన్‌లో ఉన్నారని చెప్పారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు తాను ఇంతకాలం ఆ పదవిలో ఉండాలని ఎలాంటి హామీ ఇవ్వలేదని, ‘టిల్‌ ఫర్దర్‌ ఆర్డర్స్‌’ అనే పదవి ఇచ్చారని తెలిపారు. తన కుమారుడికి పదవుల ఇవ్వాలని తాను ఏనాడూ అడగలేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయానికి తన కార్యకర్తలు రావొద్దని, వస్తే మెడ పట్టుకొని బయటకు పంపిస్తానని కొందరు మాట్లాడటంతోనే గోపాల్‌పేటలో తాను స్పందించాల్సి వచ్చిందని చెప్పారు. తనపై జరుగుతున్న పరిణామాలపై త్వరలోనే మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చిన్నారెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేవంత్‌కు అండగా.. ఆయన మాటకే అధిష్ఠానం ఓటు

రికార్డుల్లో ఒకలా.. 22ఏలో మరోలా!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 06:56 AM