Share News

రేవంత్‌కు అండగా.. ఆయన మాటకే అధిష్ఠానం ఓటు

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:37 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుకున్నది సాధించారు. మూడు రోజులపాటు దేశ రాజధానిలో మకాం వేసి.. రాష్ట్రంలో తాను చేపట్టదలచిన మార్పులపై అధిష్ఠానాన్ని ఒప్పించారు.

రేవంత్‌కు అండగా.. ఆయన మాటకే అధిష్ఠానం ఓటు
Revanth Rahul

  • పార్టీలో క్రమశిక్షణ అవసరాన్ని వివరించిన ముఖ్యమంత్రి

  • అసంతృప్తివాదులకు బలమైన సంకేతాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని అగ్రనేతలకు విజ్ఞప్తి

  • సురేఖ ఉద్వాసన సహా పలు నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌

  • సీఎం వివరణతో హైకమాండ్‌ సంతృప్తి

  • ఇన్‌చార్జిగా మీనాక్షి స్థానంలో సీనియర్‌ నేత నియామకం?

  • రేవంత్‌కు అండగా నిలవాలని నిర్ణయం

  • క్యాబినెట్‌పునర్వ్యవస్థీకరణపై జరగని చర్చ

  • అసెంబ్లీ భేటీ తర్వాత చర్చించే అవకాశం!

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుకున్నది సాధించారు. మూడు రోజులపాటు దేశ రాజధానిలో మకాం వేసి.. రాష్ట్రంలో తాను చేపట్టదలచిన మార్పులపై అధిష్ఠానాన్ని ఒప్పించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో జరిపిన చర్చల్లో.. ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో క్రమశిక్షణ నెలకొల్పి ఏకతాటిపై ముందుకు సాగాల్సిన అవసరాన్ని రేవంత్‌ వివరించారు. తన నాయకత్వాన్ని బలహీనపరిచే శక్తుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తేటీం లీడర్‌గా తాను పార్టీని, ప్రభుత్వాన్ని బలంగా ముందుకు నడపలేనని స్పష్టం చేశారు. దీంతో అధిష్ఠానం ఆయన సూచించిన ఫార్ములాకు ఆమోద ముద్ర వేసింది. కొండా సురేఖ గత ఏడాది కాలంగా తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ సృష్టించిన ఇబ్బందులను వివరించిన ముఖ్యమంత్రి.. మరికొందరు నేతలు కూడా తనకు వ్యతిరేకంగా సైంధవ పాత్ర పోషిస్తున్నారని అధిష్ఠానం పెద్దలకు తెలిపారు. కొండా సురేఖ ఉద్వాసన, చిన్నారెడ్డిపై చర్యల వల్ల పార్టీలో అసంతృప్తి వాదులకు బలమైన సంకేతాలు పంపగలమని రేవంత్‌ చెప్పినట్లు తెలిసింది. ఆయన వివరణకు సంతృప్తి చెందిన అధిష్ఠానం.. రాజీనామా చేయాల్సిందిగా కొండా సురేఖకు బుధవారమే చెప్పినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం వరకు రాజీనామా చేయకపోతే.. ఆమెను బర్తరఫ్‌ చేయాలని కూడా ఢిల్లీ అగ్రనేతలు రేవంత్‌రెడ్డికి సూచించినట్లు సమాచారం.


రేవంత్‌ నాయకత్వం బలోపేతానికి అండదండలు

గురువారం సాయంత్రం ఇందిరా భవన్‌లో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ వివిధ రాష్ట్రాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినప్పుడు తెలంగాణ విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో గత కొద్దికాలంగా పార్టీ బలహీనపడుతున్నట్లు వస్తున్న సంకేతాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రేవంత్‌ సారథ్యంలో పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలను నిర్ణయించాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడినట్లు తెలిసింది. రేవంత్‌ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతోపాటు ఆయనకు సమర్థవంతమైన అండదండలు అందించేలా తెలంగాణ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ స్థానంలో మరో సీనియర్‌ నేతను నియమించే విషయమై కూడా వారు చర్చించినట్లు సమాచారం. మీనాక్షి స్థానంలో ముకుల్‌ వాస్నిక్‌ వంటి సీనియర్‌ నేతను నియమించవచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


పునర్వ్యవస్థీకరణపై జరగని చర్చ!

మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించే క్రమంలోనే పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న ప్రచారం జరగడంతో ఆశావహులు గత రెండురోజులుగా ఢిల్లీలో అధిష్ఠానం పెద్దల చుట్టూ తిరిగారు. అయితే కొండా సురేఖ అంశాన్ని అధిష్ఠానం బర్తర్‌ఫకు మాత్రమే పరిమితం చేసింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు పునర్వ్యవస్థీకరణ ఉండదని తేల్చేసింది. దీంతో అసెంబ్లీ సమావేశాల తర్వాత పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానం దృష్టి పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరున సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌లతో సమావేశమై.. పునర్వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పుడు కూడా పునర్వ్యవస్థీకరణ జరగకపోతే నవంబరు, డిసెంబరు దాకా జాప్యం కావచ్చని అంటున్నారు. పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు చేపట్టినా ప్రక్షాళన కూడా చేసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అధిష్ఠానానికి రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌!

నేను మాట్లాడితే మా అమ్మను ఎందుకు బలి చేశారు ?

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 05:39 AM