అధిష్ఠానానికి రేవంత్ బ్లాక్‌మెయిల్!
ABN , Publish Date - Sep 04 , 2026 | 05:02 AM
మంత్రి పదవి నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను తొలగించాలనే ఆలోచన ఏఐసీసీకి లేదని, రేవంత్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలతోనే తనను బర్తరఫ్ చేశారని ఆమె ఆరోపించారు.
అందుకే నన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు
నియంతలా వ్యవహరించడం సరికాదు
ఇది అవమానం అనుకోవట్లేదు
కూతురి వ్యాఖ్యలకు నన్ను శిక్షించడమేంటి?
రాజీనామా చేయమంటే నేనే చేసేదాన్ని!
వేం నరేందర్‌రెడ్డి, పొంగులేటి, తిరుపతిరెడ్డి,
కొండల్‌రెడ్డి ఏకమై ఇబ్బందిపెట్టారు
మంత్రులెవరూ సంతోషంగా లేరు
నన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలనే ఆలోచన ఏఐసీసీకి లేదు
ఎమ్మెల్యేగా కొనసాగుతా
వివరణ అడిగి ఉంటే బాగుండేది..
మళ్లీ అధికారంలోకి రావాలంటే చాలా మార్పులు అవసరం: కొండా సురేఖ
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మంత్రి పదవి నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను తొలగించాలనే ఆలోచన ఏఐసీసీకి లేదని, రేవంత్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలతోనే తనను బర్తరఫ్ చేశారని ఆమె ఆరోపించారు. దీన్ని తాను అవమానంగా తీసుకోవట్లేదని.. ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. గురువారం మంత్రిపదవి నుంచి తొలగించిన తర్వాత కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి తనకు కేవలం ఆభరణం మాత్రమేనని, గతంలోనూ మంత్రి పదవికి తాను రాజీనామా చేశానని చెప్పారు. ‘‘రాష్ట్రంలో మంత్రులంతా సంతోషంగా ఉన్నారా? గుండెపై చేయి వేసుకుని నిజం చెప్పాలి. మంత్రులంతా బయటకు వచ్చి మాట్లాడాలి. నియోజకవర్గ పనులు కావాలంటే ఎవరి వద్దకు వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది’’ అని వ్యాఖ్యానించారు. తాను పార్టీని, ప్రభుత్వాన్ని ఏమీ అనడం లేదని పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్న మల్లు రవి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించారని, జైపాల్‌రెడ్డి ఇందిరాగాంధీని విమర్శించారని, రోశయ్య సైతం ఇందిరాగాంధీని తిట్టారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేసిన వారికి కూడా పదవులు ఇచ్చి సన్మానించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అలాంటప్పుడు తనను ఎలాంటి కారణం చెప్పకుండా తొలగించడం బాధాకరమన్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను శిక్షించడం ఏమిటని, ఆమె అభిప్రాయంతో తనకేం సంబంధమని ప్రశ్నించారు.
అడిగితే నేనే రాజీనామా చేసేదాన్ని!
ఉరిశిక్ష వేసే ముందు కూడా చివరి అవకాశం ఇస్తారని.. తనను మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే శిక్షించారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. అడిగితే తానే రాజీనామా చేసేదాన్నని, తన వివరణ తీసుకుని చర్యలు తీసుకుంటే బాగుండేదని చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే బర్తరఫ్ చేసినా బాధపడేదాన్ని కాదని.. తప్పు చేయకుండా బర్తరఫ్ చేయడం పార్టీ చేసిన తప్పని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎవరి అండా లేకుండా పైకి వచ్చామన్నారు. తన భర్తను కారులో ఎక్కించుకుని వరంగల్ అంతా తిరిగిన వారున్నారని.. గతంలో తమ కాళ్లు మొక్కి తమతో ప్రచారం చేయించుకున్నవారు కూడా ఇప్పుడు తమను నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్సీకి ఆయన భార్య కూడా ఓటు వేయదని వ్యాఖ్యానించారు. వేం నరేందర్‌రెడ్డి, పొంగులేటి, తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి ఏకమై తనను బాగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. డబ్బులు వసూలు చేసిన వ్యక్తే తన ఓఎస్డీ సుమంత్‌పై కేసుపెట్టాడని, సుమంత్ పేరుతో కిరణ్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేశాడని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో తమ మనుషులనే ఇబ్బంది పెట్టడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే మార్పులు అవసరం
కాంగ్రెస్ ప్రభుత్వం సర్దుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని కొండా సురేఖ పేర్కొన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే చాలా మార్పులు రావాల్సి ఉందన్నారు. నియంతలా వ్యవహరించడం, తనకు తానే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అందరితో చర్చించాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా కొనసాగుతానని, నియోజకవర్గ ప్రజలకు సేవచేస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీలో తనకు ఇబ్బంది కలగవచ్చని భావిస్తున్నానని చెప్పారు. అయితే దీనిని తాను అవమానంగా భావించడం లేదన్నారు. తాను తప్పు చేసి ఉంటే ఇబ్బంది పడేదాన్నని పేర్కొన్నారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డికి, దివంగత సీఎం వైఎస్సార్‌కు చాలా తేడా ఉందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News