‘స్థానికం’పై కుట్ర!
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:36 AM
‘సకాలంలో ఎన్నికలు జరిగితే రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులు వస్తాయి.. అందుకే ఎన్నికలు జరగకూడదు.. రాష్ట్రానికి నిధులు రాకూడదనేదే గొడ్డలి పార్టీ లక్ష్యం. ఇందుకోసం ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోంది’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
ఎన్నికలు జరక్కూడదు.. రాష్ట్రానికి నిధులు రాకూడదు
గొడ్డలి పార్టీ లక్ష్యమిదే.. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకి ఇష్టం లేదు
స్థానిక ఎన్నికలు జరిపి తీరుతాం.. నవంబరు చివరిలోపు అన్నీ పూర్తి
అక్టోబరు నెలాఖరులో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు..
వారం తేడాతో పరిషత్‌లకు.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు
మిత్రపక్షాల మధ్య గ్యాప్ రావొద్దు.. బీసీలకు 34 శాతానికి మించే సీట్లు
టీడీపీ ముఖ్య నేతలతో భేటీలో సీఎం వెల్లడి.. క్యాబినెట్ భేటీలోనూ నిర్దేశం
స్థానిక ఎన్నికలకు టీడీపీ యంత్రాంగం సమాయత్తమవ్వాలి. అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన స్ట్రైక్ రేట్ సాధించాలి. 2024తో పోల్చుకుంటే ప్రస్తుతం మనం ఎక్కడున్నామో విశ్లేషించుకునే అవకాశం ఈ ఎన్నికల ద్వారా కలుగుతుంది.
- సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘సకాలంలో ఎన్నికలు జరిగితే రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులు వస్తాయి.. అందుకే ఎన్నికలు జరగకూడదు.. రాష్ట్రానికి నిధులు రాకూడదనేదే గొడ్డలి పార్టీ లక్ష్యం. ఇందుకోసం ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోంది’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నిధులు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. అందుకే ‘సర్’ ప్రక్రియ పూర్తికాకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదని కోర్టుకు వెళ్లిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం రాత్రి ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జోనల్ పరిశీలకులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. అంతకుముందు క్యాబినెట్ సమావేశంలోనూ స్థానిక ఎన్నికలపై మంత్రులకు ఆయన ఆదేశాలిచ్చారు. కార్పొరేషన్ల నుంచి పంచాయతీల వరకు స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఈ ఏడాదిలోనే పూర్తికావాలని స్పష్టం చేశారు. అక్టోబరు నెలాఖరులో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిద్దామని.. ఆ తర్వాత వారం తేడాతో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరుపుదామని..
నవంబరు ముగిసేలోపు గ్రామ పంచాయతీలకూ నిర్వహించి.. ఎన్నికల ప్రక్రియను ముగిద్దామని చెప్పారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 23 మున్సిపాలిటీలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకుని మొత్తం అన్ని మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలకు వెళ్లాల్సిందేనని తెలిప్పారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులు తీసుకోవాలన్నారు. ‘గొడ్డలి పార్టీ కుట్రలు, కుతంత్రాలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారి కుట్రలను ఛేదించాలి. ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి’ అని సూచించారు. కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం టీడీపీకి ఇదే మొదటిసారని చంద్రబాబు గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి పార్టీల మధ్య గ్యాప్ రాకూడదన్నారు. మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడంతోపాటు పార్టీలో కూడా పాత-కొత్త కలయికతో పనిచేయాలని సూచించారు.
అభ్యర్థుల ఎంపికలో సోషల్ రీఇంజనీరింగ్
సోషల్ రీ ఇంజనీరింగ్ విధానంలో అభ్యర్థుల ఎంపిక జరిగితే ప్రజలు అర్థం చేసుకుంటారని.. ఓట్లేస్తారని సీఎం అభిప్రాయపడ్డారు. అభ్యర్థుల ఎంపికలో యువత, మహిళలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రజలు, కార్యకర్తల ఆమోదం, పనితీరు ఆధారంగా ఎంపిక జరుగుతుందని చెప్పారు. ‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 34 శాతం రిజర్వేషన్ ఇస్తాం. అవసరమైతే అంతకుమించి ఇస్తామే తప్ప ఒక్క శాతం కూడా తక్కువ ఇచ్చే ప్రసక్తే లేదు. బీసీ రిజర్వేషన్లపై కొందరు కోర్టుకు వెళ్లారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధితో ఉన్నాం. వీటిపై కోర్టులో పిటిషన్లు వేసినా ప్రభుత్వపరంగా న్యాయపోరాటం చేస్తున్నాం. ‘జయహో బీసీ’ సభల్లో గొడ్డలి పార్టీ వెనుకబడిన వర్గాలకు చేసిన అన్యాయాన్ని వివరించాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆల్ టైమ్ రికార్డు సృష్టించేలా సంక్షేమం అమలు చేస్తున్నాం. వెలిగొండ ఫేజ్-1 ప్రారంభించాం.. చరిత్ర సృష్టించాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మార్గం సుగమం చేస్తూ పోలవరం ఎడమ కాలువ నుంచి నీటి విడుదల ప్రారంభించి అనకాపల్లి తీసుకెళ్లాం. హంద్రీ-నీవా కాలువల ద్వారా రాయలసీమలో చివరి ప్రాంతానికి నీరందించాం. 2019లో ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే నదుల అనుసంధానం జరిగేది. నదుల అనుసంధానం జరిగితే ఎల్‌నినో లాంటి విపత్తులను ధైర్యంగా ఎదుర్కొనేవాళ్లం’ అని చంద్రబాబు వివరించారు.
సీఎం రాగానే లేచి నిలబడి చప్పట్లు..
క్యాబినెట్ సమావేశం ప్రారంభంలో సీఎం చంద్రబాబు రాగానే మంత్రులు, అధికారులందరూ లేచి నిల్చొని చప్పట్లతో అభినందనలు తెలిపారు. రెండ్రోజుల తేడాతో ప్రతిష్ఠాత్మకమైన వెలిగొండ, పోలవరం ఎడమ కాలువను ప్రారంభించుకోవడం ద్వారా ఆయన అరుదైన ఘనత సాధించారని మంత్రులు పేర్కొన్నారు.
ఈ నెల రెండు లేదా మూడోవారంలో మదనపల్లెలో ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.
ఆంధ్ర పాప్‌కార్న్, అరకు కాఫీ ప్రతి గ్రామంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని.. వాటికి బ్రాండింగ్ చేయాలని మంత్రులకు సూచించారు.
దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు ఖరారైందని సీఎం చెప్పారు.
పీఎం సూర్యఘర్ వినియోగంలో రాష్ట్రం 4వ స్థానంలో ఉందని.. మొదటి స్థానానికి రావడానికి మంత్రులందరూ బాధ్యత తీసుకోవాలని సీఎం చెప్పారు. ఎక్కువ మంది పీఎం సూర్యఘర్‌ను వినియోగించుకునేలా చూడాలన్నారు.
ప్రొటోకాల్ ఉల్లంఘనపై సీరియస్
ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనపై సీఎం సీరియస్ అయ్యారు. వెలిగొండ ప్రారంభోత్సవం, పోలవరం ఎడమ కాలువకు నీటి విడుదల ప్రకటనల్లో సంబంధిత శాఖ మంత్రి నిమ్మల ఫొటో లేకపోవడాన్ని సీఎం తప్పుబట్టారు. సమన్వయ లోపంతో జరిగే ఇలాంటి తప్పిదాల వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ఠ వస్తుందని, చిన్న చిన్న పొరపాట్లే తర్వాత పెద్దవిగా మారతాయని చెప్పారు. జీఏడీ, సమాచార-పౌరసంబంధాల శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తే ఇలాంటివి జరగవన్నారు. తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ
పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి