స్నేహితులే కిడ్నాపర్లు.. నాని క్రికెట్ ప్రిడిక్షన్ యాప్ నిర్వాహకుడికి విముక్తి
ABN , Publish Date - Sep 03 , 2026 | 08:54 AM
నాని క్రికెట్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ యాప్ నిర్వాహకుడు సుమంత్ కిడ్నాప్ కేసును తిరుపతి రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
తిరుపతి, సెప్టెంబర్ 03: ‘నాని క్రికెట్ ప్రిడిక్షన్’ టెలిగ్రామ్ యాప్ నిర్వాహకుడు సుమంత్ కిడ్నాప్ కేసును తిరుపతి రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తిరుపతి రూరల్ పోలీసులు తెలిపారు. టెలిగ్రామ్ యాప్‌ను నార్త్ ఇండియా వ్యక్తులకు రూ.6 కోట్లకు సుమంత్ విక్రయించాడని చెప్పారు. ఆ నగదు లావాదేవీలు హవాలా మార్గంలో జరిగాయని వివరించారు. ఈ రూ.6 కోట్లపై సుమంత్ స్నేహితులు యశ్వంత్, మనోజ్, గౌతమ్, బాలాజీ, చరణ్, వాజిద్‌లు కన్నేశారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సుమంత్ కిడ్నాప్‌కు వారంతా పథక రచన చేశారని పోలీసులు తెలిపారు. దాంతో ఇండోనేషియా నుంచి వచ్చిన సుమంత్‌ను బెంగళూరు సమీపంలో కిడ్నాప్ చేశారని చెప్పారు. అనంతరం అతడిని హైదరాబాద్‌కు తరలించి.. కేపీహెచ్‌బీ కాలనీలోని ఆపార్ట్‌మెంట్‌లో బంధించారని వివరించారు. తనను కిడ్నాప్ చేశారంటూ యూరప్‌లోని తన గర్ల్‌ఫ్రెండ్‌కు సుమంత్ వాట్సప్ మెసేజ్ పంపాడని పేర్కొన్నారు.
దాంతో కేపీహెచ్‌బీ పోలీసులను ఆమె ఆశ్రయించిందని తెలిపారు. దీంతో బాధితుడు సుమంత్‌కు కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి కలిగించామన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరికి చెందిన బాలాజీ, చరణ్, వాజిద్‌లను అరెస్ట్ చేశామని తెలిపారు. పరారీలో ఉన్న యశ్వంత్, మనోజ్, గౌతమ్‌ల కోసం గాలిస్తున్నామని తిరుపతి రూరల్ పోలీసులు వివరించారు.