పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి
ABN , Publish Date - Sep 03 , 2026 | 08:00 PM
పదవి ఉన్నా.. లేకున్నా తన గౌరవం తనకు ఉంటుందని మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి అన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయనను తొలగించడంపై స్పందిస్తూ చిన్నారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
వనపర్తి జిల్లా: పదవి ఉన్నా.. లేకున్నా తన గౌరవం తనకు ఉంటుందని మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి అన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని స్పష్టం చేశారు. పదవిలో ఉన్నా, లేకున్నా వారి కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటానని తేల్చి చెప్పారు. గురువారం గోపాల్‌పేట మండలంలోని తన స్వగ్రామం జయన్న తిరుమలాపూర్‌లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనను తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి నుంచి తొలగించడంపై చిన్నారెడ్డి స్పందించారు.
క్యాబినెట్ హోదా ఉన్న సమయంలోనే తనకు ప్రభుత్వం కల్పించిన కారు, డ్రైవర్, సెక్యూరిటీ తదితర సౌకర్యాలను తిరిగి పంపించానని చిన్నారెడ్డి తెలిపారు. తనకు ఇచ్చిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి సంబంధించిన ఉత్తర్వుల్లోనే ‘ఇంటిగ్రేటెడ్ ఆర్డర్’గా పేర్కొన్నారని, అయితే ఎన్ని సంవత్సరాల పాటు పదవిలో కొనసాగాలనే విషయాన్ని అందులో ప్రస్తావించలేదన్నారు. తన కుమారుడికి ఏదైనా పదవి ఇప్పించాలని ముఖ్యమంత్రి వద్ద తాను ఎప్పుడూ అడగలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వి. హనుమంతరావు తర్వాత తానే సీనియర్ నాయకుడినని పేర్కొన్నారు. ప్రస్తుతం తలెత్తిన సమస్యకు ప్రధాన కారణం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవేనని చిన్నారెడ్డి ఆరోపించారు.
తన రాజకీయ ప్రస్థానం, పార్టీ కోసం చేసిన సేవలను గుర్తు చేస్తూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో 42 మంది ఎమ్మెల్యేలతో వనపర్తిలో భారీ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో సంతకాలు సేకరించి ఉద్యమానికి తాను ఊపిరి పోసినట్లు గుర్తు చేసుకున్నారు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని, అయితే ప్రజలు, కార్యకర్తలతో తన అనుబంధం మాత్రం శాశ్వతమని చిన్నారెడ్డి పేర్కొన్నారు. పదవి లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటానని, తనను నమ్ముకున్న వారి కోసం ఎప్పటికీ పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వరా?.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూటి ప్రశ్న..