తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వరా?.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూటి ప్రశ్న..
ABN , Publish Date - Sep 03 , 2026 | 06:18 PM
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫోన్ చేస్తే ఆటోలో యూరియా వచ్చేదని, కాంగ్రెస్ పాలనలో మాత్రం యూరియా కోసం రైతులు తమ చెప్పులను లైన్లలో పెట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు.
మిర్యాలగూడ: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫోన్ చేస్తే ఆటోలో యూరియా వచ్చేదని, కాంగ్రెస్ పాలనలో మాత్రం యూరియా కోసం రైతులు తమ చెప్పులను లైన్లలో పెట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. నల్లగొండ జిల్లాకు దరిద్రాన్ని తెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నామని.. రక్తం రుచి మరిగిన కాంగ్రెస్ రాక్షస పులిని తెచ్చుకున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో కేటీఆర్ ఈరోజు (గురువారం) పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
నాగార్జునసాగర్‌లో నీళ్లు ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు శనిలా దాపురించారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రైతుల కళ్లల్లో నీళ్లు తెప్పించిన ‘నీళ్ల మంత్రి’ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాద ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలనూ కేటీఆర్ ప్రస్తావించారు. సొరంగంలో ‘వాటర్‌లో నీళ్లు కలిశాయి’ అంటూ మంత్రి మాట్లాడారని.. అసలు ఆయన ‘క్వార్టర్‌లో నీళ్లు కలిశాయో ఏమో’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హుజూర్‌నగర్‌లో నీళ్ల కోసం రైతులు తమ బాధలు చెప్పుకుందామంటే వారిని గెదుముతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వ్యవహారం కూడా అందుకు భిన్నంగా లేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, అందుకే తెలంగాణ నీళ్లు కిందికి పోతున్నా మాట్లాడటం లేదని ఆరోపించారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి లోపు రైతులకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటిలోగా నీళ్లు ఇవ్వకపోతే కోదాడ నుంచి హాలియా వరకు వేలాది మంది రైతులతో పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు. ఈనెల 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా చెప్పుకునే అవకాశం ఇస్తారు: కొండా సురేఖ..
కాంగ్రెస్ లక్ష్మణ రేఖ దాటితే ఎవ్వరిపైనైనా చర్యలు ఉంటాయి: మల్లు రవి..