Share News

కాంగ్రెస్ లక్ష్మణ రేఖ దాటితే ఎవ్వరిపైనైనా చర్యలు ఉంటాయి: మల్లు రవి..

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:35 PM

కాంగ్రెస్ లక్ష్మణ రేఖ దాటితే ఎంతటి వారిపై అయినా చర్యలు ఉంటాయని తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తేల్చి చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై తీసుకున్న చర్యలే ఇందుకు ఉదాహరణ అని అన్నారు.

కాంగ్రెస్ లక్ష్మణ రేఖ దాటితే ఎవ్వరిపైనైనా చర్యలు ఉంటాయి: మల్లు రవి..
Mallu Ravi

హైదరాబాద్: కాంగ్రెస్ లక్ష్మణ రేఖ దాటితే ఎంతటి వారిపై అయినా చర్యలు ఉంటాయని తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తేల్చి చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై తీసుకున్న చర్యలే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటిన కొండా సురేఖ, చిన్నారెడ్డిని పదవుల నుంచి తొలగించారని చెప్పారు. దీనిపై ఇప్పటికే ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నామని చాలా మంది తమను ప్రశ్నించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా సమస్యను పరిష్కరించాలనే ఆలస్యమైందని మల్లు రవి తెలిపారు.


ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో రాజయ్యను సమాచారం లేకుండానే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారని మల్లు రవి గుర్తు చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వచ్చిన ఆరోపణలతో క్రమశిక్షణా కమిటీ నివేదిక రూపొందించి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇచ్చిందన్నారు. ఇద్దరి వ్యాఖ్యలను పరిశీలించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరినట్లు ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ కేడర్‌కు సందేశం వెళ్లేలా చర్యలు ఉండాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ రేఖ దాటితే ఎంతటి వారైనా చర్యలు ఉంటాయని తెలిసేలా ఏఐసీసీ చర్యలు తీసుకుందని రవి వివరించారు.


కేసీ వేణుగోపాల్ విదేశాల్లో ఉండటంతో ఈ అంశంపై నిర్ణయం ఆలస్యమైందని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రెండు సార్లు కలిసే అవకాశం ఇచ్చారని, దీంతో కొండా సురేఖ తన వాదనను అధిష్ఠానానికి చెప్పుకున్నారని పేర్కొన్నారు. వారి మధ్య ఏం చర్చలు జరిగాయో తెలియదని చెప్పారు. సీఎం రేవంత్ బ్లాక్‌మెయిల్ చేసి చర్యలు తీసుకునే వ్యక్తి అయితే నేరుగా చర్యలు తీసుకునేవారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆ విధానం ఉండదని, మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కొండా సురేఖ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలన్నారు.


మరోవైపు, ముఖ్యమంత్రిపై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను సురేఖ ఖండించలేదని మల్లు రవి మండిపడ్డారు. కొండా సురేఖపై తనకు ఫిర్యాదులు అందాయని, కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఫిర్యాదులు వస్తే వారిపైనా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కొండా సురేఖ, మురళీ, చిన్నారెడ్డికి తాను వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదన్నారు. సురేఖ చేసిన తప్పుల ఆధారంగానే చర్యలు తీసుకున్నామన్నారు. కులాల ఆధారంగా పార్టీలో చర్యలు ఉండవని, కుట్ర అని ఆమె అనుకుంటే తానేమీ చేయలేనన్నారు. సీఎంను ఏమైనా అంటే ఖండించాల్సిన బాధ్యత కేబినెట్ మంత్రిపై ఉంటుందన్నారు. తన కూతురు చేసింది తప్పు అని ఖర్గే దగ్గర కూడా సురేఖ చెప్పలేదన్నారు.


పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే జిల్లా అధ్యక్షుడు, పీసీసీ అధ్యక్షుడు నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మల్లు రవి చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉత్సాహపరచడానికే రేవంత్ రెడ్డి.. టికెట్ల ప్రకటన, సీఎంగా తానే ఉంటానని చెప్పారన్నారు. దానిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసమే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారనే తప్పా సొంత ప్రయోజనాల కోసం కాదన్నారు. సీఎంగా ఎవరుండాలి.. టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కొండా సురేఖను మంత్రిగా తొలగించినా ఆమె పార్టీలోనే కొనసాగాలని కోరుకుంటున్నామని మల్లు రవి చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

మంత్రి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయడం దారుణం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..

ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా చెప్పుకునే అవకాశం ఇస్తారు: కొండా సురేఖ..

Updated Date - Sep 03 , 2026 | 05:35 PM