Share News

ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా చెప్పుకునే అవకాశం ఇస్తారు: కొండా సురేఖ..

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:30 PM

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ స్పందించారు. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా ఏదైనా చెప్పుకునే అవకాశం ఇస్తారని, తనకు మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా శిక్షించారని అన్నారు.

ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా చెప్పుకునే అవకాశం ఇస్తారు: కొండా సురేఖ..
Minister Konda Surekha

హైదరాబాద్: దేవాదాయ శాఖ మంత్రిగా తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ స్పందించారు. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా ఏదైనా చెప్పుకునే అవకాశం ఇస్తారని, తనకు మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా శిక్షించారని అన్నారు. తన కుమార్తె కొండా సుస్మిత పటేల్ వ్యాఖ్యలకు తనను శిక్షించడం ఏంటని.. ఆమె అభిప్రాయంతో తనకేం సంబంధమని కాంగ్రెస్ పెద్దలను సురేఖ సూటిగా ప్రశ్నించారు. రాజీనామా చేయమంటే చేసేదాన్నని, తన వివరణ అడిగి చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు. నిజంగా తాను తప్పు చేసి ఉంటే బర్తరఫ్ చేసినా పర్వాలేదని కొండా సురేఖ చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. 'మంత్రి పదవి నాకు ఆభరణం మాత్రమే. కారణం చెప్పకుండా తొలగించడం బాధాకరం. గతంలో మంత్రి పదవికి స్వయంగా నేనే రాజీనామా చేశా. ప్రస్తుతం మంత్రులు సంతోషంగా లేరు. ఈ విషయం గుండెపై చేయి వేసుకొని వారు చెప్పాలి. మంత్రులంతా బయటకు వచ్చి మాట్లాడాలి. పనులు కావాలంటే ఎవరి వద్దకు వెళ్లాలో అర్థం కాదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని కోరుతున్నాను. నేను పార్టీని, ప్రభుత్వాన్ని ఏం అనలేదు. మల్లు రవి కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టినవారే. ఇందిరాగాంధీని జైపాల్ రెడ్డి తిట్టారు. రోశయ్య సైతం ఇందిరాగాంధీని తిట్టారు. సీఎం రేవంత్‌పై ఆరోపణలు చేసిన వారికీ పదవులు ఇచ్చి సన్మానం చేశారు.


ఎవరి అండ లేకుండా మేం పైకి వచ్చాం. నా భర్తను కారులో ఎక్కించుకొని వరంగల్ అంతా తిప్పారు. మా కాళ్లు మొక్కి మాతో ప్రచారం చేయించుకున్న వాళ్లూ మమ్మల్ని తిడుతున్నారు. మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్సీకి వాళ్ల భార్య కూడా ఓటేయదు. నన్ను తొలగించాలనే ఆలోచన ఏఐసీసీకి లేదు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసి నన్ను బర్తరఫ్ చేశారు. వేం, పొంగులేటి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి ఏకమై నన్ను ఇబ్బంది పెట్టారు. డబ్బులు వసూలు చేసిన వాడే నా మాజీ ఓఎస్డీ సుమంత్‌పై కేసు పెట్టాడు. సుమంత్ పేరు చెప్పి కిరణ్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేశాడు. తమ ప్రభుత్వంలో తమ మనుషులను ఇబ్బంది పెట్టుకోవడం చరిత్రలో ఎక్కడా లేదు. సుమంత్‌ని ఇబ్బంది పెట్టడం ఆపేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. కాంగ్రెస్ సర్కార్ సరిదిద్దుకోవాల్సిన, మార్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.


ప్రభుత్వం మళ్లీ రావాలంటే చాలా మార్పులు జరగాలి. మోనోపాలీ లాగా వెళ్లడం సరైంది కాదు. తనకు తానే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం సరికాదు. నిర్ణయాలు తీసుకునేప్పుడు చర్చించాలి. ఎమ్మెల్యేగా ఉంటాను.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తాను. నాకు పార్టీలో ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నా. నా కూతురు వ్యాఖ్యలను నేను ఖండిస్తే ఆమెను కించపరిచినట్టు అవుతుంది. మంత్రిగా తొలగించడం అవమానమని అనుకోవడం లేదు. నేను తప్పు చేస్తే ఇబ్బంది పడేదాన్ని. తప్పు చేయకుండా బర్తరఫ్ చేయడం పార్టీ తప్పు. రేవంత్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తేడా ఉంది' అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై వేటు.. పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు..

మంత్రి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయడం దారుణం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..

Updated Date - Sep 03 , 2026 | 05:00 PM