ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై వేటు.. పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు..
ABN , Publish Date - Sep 03 , 2026 | 03:13 PM
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఎపిసోడ్‌కు తెరపడింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఎపిసోడ్‌కు తెరపడింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ సిఫారసు లేఖను తెలంగాణ గవర్నర్‌కు పంపిన సీఎంవో.. అదే సమయంలో చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారెడ్డి స్థానంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ మొదలైంది. ఈ నిర్ణయంతో పార్టీ క్రమశిక్షణ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని అగ్రనాయకత్వం స్పష్టం చేసినట్లయింది.
చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి..?
కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆగస్టు 16వ తేదీన వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సొంత పార్టీకే చెందిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వనపర్తి ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారని చిన్నారెడ్డి అన్నారు. ఆయన వద్ద డబ్బు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు. అయితే, పార్టీలోని ఎన్నికల కమిటీ డబ్బులకు ఆశపడి తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా మేఘారెడ్డి మార్చారని మండిపడ్డారు. తన పనులకూ ఆయన అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. తన ఓపిక నశిస్తే మరో జీవన్‌రెడ్డిలా మారి తిరగబడతానని చిన్నారెడ్డి హెచ్చరించారు.
మేఘారెడ్డి రియాక్షన్..
తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నానంటూ చిన్నారెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సర్వే నిర్వహించిందని, గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇచ్చిందన్నారు. తాను టికెట్ కోసం నగదు ఇచ్చానని ఆరోపించిన చిన్నారెడ్డి.. ఎవరికి ఇచ్చానో వారి పేర్లను కూడా బయటపెట్టాలని మేఘారెడ్డి సవాల్ చేశారు. 2014, 2018 ఎన్నికల వేళ ఇకపై తాను పోటీ చేయబోనని చిన్నారెడ్డి చెప్పారని, పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని ఆయన చెప్పారన్నారు. చిన్నారెడ్డి అనవసర వ్యాఖ్యలు చేస్తూ పార్టీతో పాటు తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని మేఘారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఉమ్మడి మెదక్ జిల్లాపై సీఎం రేవంత్ పగబట్టారు: హరీశ్ రావు
కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం