లా విద్యార్థులపై చర్యలు తీసుకోవడానికి BCIకి అధికారం లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:41 PM
లా చదువుతున్న విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యానికి సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. విద్యార్థి దశలో క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిళ్లకు లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. NALSAR విద్యార్థుల విషయంలో BCI ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 3: లా చదువుతున్న విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యానికి సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)కి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని NALSAR యూనివర్సిటీ విద్యార్థులపై BCI చైర్మన్ జారీ చేసిన ఆదేశాలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ రద్దు చేసింది. న్యాయవాదిగా ఎన్‌రోల్‌మెంట్ పొందిన తర్వాతే వ్యక్తి BCI పరిధిలోకి వస్తారని, అంతకుముందు విద్యార్థి దశలో లా కాలేజీలు, యూనివర్సిటీలకే తమ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని తేల్చిచెప్పింది. 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం లా విద్యార్థులపై చర్యలు తీసుకునే అధికారం BCIకి గానీ, రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు గానీ లేదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
CJIపై ప్రచారం నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో NALSAR 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలని BCI చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ NALSAR పూర్వ విద్యార్థులు మిహిరా సూద్, అభిషేక్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన CJI సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల భావప్రకటన స్వేచ్ఛను హరించేలా ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడం సరికాదని పేర్కొంది. విద్యార్థులపై చర్యలు తీసుకోవాల్సి వస్తే వారు చదువుతున్న విద్యాసంస్థలే తమ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. తాజా తీర్పు లా విద్యార్థుల హక్కులు, విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి, భావప్రకటన స్వేచ్ఛ విషయంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి...
రెండు చక్రాలపై ఆటో డ్రైవర్ ప్రమాదకర స్టంట్..
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీకి ఛాన్స్.. సురేఖ అంశాన్ని తేల్చేస్తారా..
Read Latest Telangana News And Telugu News