Share News

రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీకి ఛాన్స్.. సురేఖ అంశాన్ని తేల్చేస్తారా..

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:27 AM

తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా రాజకీయ పరిణామాలు ఢిల్లీ వేదికగా ఉత్కంఠను రేపుతున్నాయి. ఈరోజు ఏఐసీసీ అగ్రినేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీకి ఛాన్స్.. సురేఖ అంశాన్ని తేల్చేస్తారా..
CM Revanth Reddy

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా రాజకీయ పరిణామాలు ఢిల్లీ వేదికగా ఉత్కంఠను రేపుతున్నాయి. ఈరోజు(గురువారం) ఏఐసీసీ అగ్రినేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత విభేదాలు, తదితర అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా రాహుల్‌తో సీఎం భేటీ తర్వాత మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. కొండా సురేఖ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించినట్లు సమాచారం. ఢిల్లీలో రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. కొండా సురేఖ అంశంపై నివేదికను, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సూచనలు కాంగ్రెస్ అధిష్ఠానానికి అందజేశారు. ఈరోజు రాహుల్‌తో సీఎం రేవంత్ భేటీ జరిగితే.. కొండా సురేఖపై చర్యల విషయంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక, ఈరోజు ఢిల్లీలో కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరనున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

గంజాయి డాన్ నీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు

రెండు చక్రాలపై ఆటో డ్రైవర్ ప్రమాదకర స్టంట్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 11:49 AM