మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం దారుణం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..
ABN , Publish Date - Sep 03 , 2026 | 03:52 PM
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ అంశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖను బర్తరఫ్ చేయడం అన్యాయమని అన్నారు.
నారాయణపేట జిల్లా: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ అంశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖను బర్తరఫ్ చేయడం అన్యాయమని అన్నారు. పార్టీ అంతర్గత విషయమైనా ఓ బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం దారుణమన్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నేతృత్వంలో 'బీఆర్ఎస్ రైతు గర్జన' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని అన్నారు. కానీ ఓ బీసీ మహిళపై మాత్రమే చర్యలు తీసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీసీ మహిళ కాబట్టే మంత్రి పదవి నుంచి సురేఖను తొలగించారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అనేక మంది పార్టీ లైన్ దాటినా వారిపై చర్యలు లేవన్నారు. కొంతమంది మంత్రులకు ఒక న్యాయం.. సురేఖకు మరో న్యాయమా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. అనేక మంది మంత్రులపై అవినీతి, కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయని, వారిపై చర్యలు లేవని మండిపడ్డారు. బీసీలను ఇప్పటికే కాంగ్రెస్ అనేక రకాలుగా మోసం చేసిందని, సురేఖ పట్ల కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరించిందని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం