సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Sep 03 , 2026 | 06:41 PM
సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్: సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (గురువారం) ప్రారంభించారు. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అనంతరం దానిపై ఆయన ప్రయాణించారు. ఆ తర్వాత వంతెనకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ వివరాలను ముఖ్యమంత్రికి జీహెచ్‌ఎంసీ అధికారులు వివరించారు. దీని ప్రారంభంతో గ్రేటర్ హైదరాబాద్‌లో మరో భారీ వంతెన అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భాగ్యనగరంలో ఇప్పటికే అతి పొడవైన స్టీల్ వంతెన 2.3 కిలోమీటర్ల పొడవుతో ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు ఉంది. తాజాగా సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని 3.32 కి.మీ.ల పొడవుతో రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వంతెన చంచల్‌గూడ జైలు నుంచి సంతోష్ నగర్‌లోని యాదగిరి థియేటర్ వరకు ఉంది. కాగా, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నాలుగు లేన్ల ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2020లో శంకుస్థాపన జరిగింది.
ఈ వంతెన అందుబాటులోకి రావడంతో నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ వరకు 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం లభించింది. కాగా, ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించేందుకు 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది. తాజాగా బ్రిడ్జి ప్రారంభంతో నగరవాసులకు ప్రయాణం సులభం కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం దారుణం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..
ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా చెప్పుకునే అవకాశం ఇస్తారు: కొండా సురేఖ..