Share News

దోస్తీకే గులామ్‌ని

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:43 AM

స్నేహంతో తనను ఎవరైనా గెలవవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తానెవరికీ గులాం కాదని, కేవలం స్నేహానికి మాత్రమే గులాంనని వ్యాఖ్యానించారు. తననెవరూ భయపెట్టలేరని, ధమ్కీ ఇవ్వలేరని చెప్పారు.

దోస్తీకే గులామ్‌ని
Revanth Reddy Ponnam Prabhakar Owaisi

  • స్నేహంగా అడిగితే అన్నీ చేసిపెడతా.. నన్నెవరూ భయపెట్టలేరు!

  • ఒక్క చాన్స్‌ రాజకీయాలు కావు నావి.. మరో పాతికేళ్లు ఉంటా

  • మెట్రో పూర్తి చేశాకే పాతబస్తీలో ఓట్లడుగుతా

  • ఒవైసీల దేశభక్తిని శంకించనక్కర్లేదు.. మోదీ, షాల కన్నా తక్కువ కాదు

  • నాకు మజ్లిస్‌ ఓట్లు అక్కర్లేదు.. అభివృద్ధి పథంలో కలిసొస్తే చాలు

  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయి: రేవంత్‌రెడ్డి

  • మలక్‌పేట-సంతో్‌షనగర్‌ స్టీల్‌ వంతెన ప్రారంభం

  • మలక్‌పేటలో సభ అనంతరం గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): స్నేహంతో తనను ఎవరైనా గెలవవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తానెవరికీ గులాం కాదని, కేవలం స్నేహానికి మాత్రమే గులాంనని వ్యాఖ్యానించారు. తననెవరూ భయపెట్టలేరని, ధమ్కీ ఇవ్వలేరని చెప్పారు. స్నేహంగా అడిగితే అన్నీ చేసి పెట్టడం తన బలహీనత అన్నారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించాలని గవర్నర్‌కు సిఫారసు లేఖ పంపించిన తర్వాత హైదరాబాద్‌ పాతబస్తీలోని చంచల్‌గూడ-సంతోష్‌నగర్‌ల మధ్య నిర్మించిన స్టీల్‌ వంతెనను ప్రారంభించిన సీఎం ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. అన్యాపదేశంగా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ‘‘ఎన్నికలు వస్తుంటాయి. పోతుంటాయి. గెలుపోటములు సహజం. ఒక్క చాన్స్‌ కోసం రాజకీయాల్లోకి రాలేదు. మరో పాతికేళ్లు రాజకీయాల్లోనే ఉంటా. అభివృద్ధిలో అందరినీ కలుపుకొని పోతా’’ అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంబ్రిడ్జి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టిందని, ఒక్క రూపాయి చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిర్మించామని అన్నారు. ఓల్డ్‌ సిటీ అంటే ఒరిజినల్‌ సిటీ అని, దాని అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. మీరాలం ట్యాంకు కేబుల్‌ బ్రిడ్జి పూర్తయ్యితే పర్యాటకంగా, రవాణా పరంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. నిజాం కాలంలో జరిగిన నగర అభివృద్ధి అంతర్జాతీయంగా పేరు గాంచిందని, ప్రస్తుతం ఓల్డ్‌ సిటీ అంటే మురికివాడగా చూసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. వారి తరహాలో ఓల్డ్‌ సిటీని తిరిగి అభివృద్ధి చేసి రాబోయే తరాలకు తన మార్క్‌ చూపిస్తానని సీఎం ధీమాను వ్యక్తం చేశారు. గౌలిగూడ-చంద్రాయణ్‌గుట్ట మెట్రో నిర్మించిన తర్వాతే ఆ మెట్రోలో వచ్చి పాతబస్తీలో ఓట్లు అడుగుతానని ముఖ్యమంత్రి ప్రకటించారు. పాతబస్తీలో ప్రతీ గల్లీ తనకు తెలుసన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా 18 మంది ముఖ్యమంత్రులు అయ్యారని, ఎవరూ పాతబస్తీకి వచ్చి, నిలబడి మాట్లాడలేదని గుర్తు చేశారు. పాతబస్తీకి ఏం కావాలో చెబితే నిధులు తానిస్తానని ప్రకటించారు. ఓవైసీ అడిగిన పనులన్నీ పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌, కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. ఓల్డ్‌ సిటీలో మహిళా డిగ్రీ కళాశాల కోసం రూ.20 కోట్లు కావాలని ఓవైసీ అడగ్గా, వేదిక నుంచే రూ.25 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏడాదిన్నరలో పూర్తి చేయించుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదేనన్నారు. విద్య కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఎన్నికల్లో ఎంఐఎం సపోర్టు తాను అడగడం లేదని, పాత బస్తీ అభివృద్ధికి కలిసి పని చేద్దామని మాత్రమే కోరుతున్నానని అన్నారు.


ఒవైసీల దేశభక్తిని అనుమానించాల్సిన అవసరం లేదు

అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ల దేశభక్తిని అనుమానించాల్సిన అవసరం లేదని, రాజకీయంగా ఒవైసీ ఎవరినైనా విమర్శించవచ్చు కానీ దేశ ఐక్యత విషయంలో ఆయన ముందుంటారని ముఖ్యమంత్రి చెప్పారు. దేశభక్తిలో మోదీ, అమిత్‌షాల కంటే అసద్‌ తక్కువేమీ కాదన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో సాయుధ దళాల విజయాన్ని కాంక్షిస్తూ అసదుద్దీన్‌ ఒవైసీ నెక్లెస్‌ రోడ్డులో ప్రజల ముందుండి నడిచారని గుర్తు చేసుకున్నారు. ఎంఐఎం ఒకసారి కాంగ్రెస్‌ను ఓడించేందుకు గట్టిగా ప్రయత్నించిందని, అవన్నీ రాజకీయాల్లో భాగమని వ్యాఖ్యానించారు. చార్మినార్‌, యకత్‌పురాలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి స్థలాలు లేవని, ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఉంటే చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ స్థలాలను పెద్దలు కబ్జా చేస్తే కూల్చేస్తామని, పేదలు గుడిసెలు వేస్తే వారికి ఇందిరమ్మ టవర్లకు తరలిస్తామని చెప్పారు. తెలంగాణలో హిందూ, ముస్లిం కలిసి నడవాలని, దేశంలో నెంబర్‌ వన్‌ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యేల నుంచి వచ్చే దరఖాస్తులను, అందులోని సమస్యలను పరిష్కారించడానికి ప్రభుత్వం శ్రద్ధతో పని చేస్తుందన్నారు.


మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు

మూసీ అభివృద్ధి ప్రాజెక్టును బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు వ్యతిరేకిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గుజరాత్‌తో సబర్మతీనది, యూపీలో గంగా, ఢిల్లీలో యమునా రివర్‌ ఫ్రంట్‌ల పేరుతో అభివృద్ధి చేసి గొప్పగా చెప్పుకుంటున్నారని, మూసీ రివర్‌ ఫ్రంట్‌ను మాత్రం అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ విధానమే అభివృద్ధిని అడ్డుకోవడమని, పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ మతి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. బీజేపీ గుజరాత్‌కు గులామ్‌ అని, అన్నీ ఆ రాష్ట్రానికే ఇస్తుందని, ఇక్కడ అభివృద్ధి చేయబోతే పిటిషన్లు వేసి అడ్డుకుంటారని దుయ్యబట్టారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తే మైనారిటీలకు ఉపయోగపడుతుందని, అసదుద్దీన్‌ సూచనలకు అనుగుణంగా ఇక్కడ నైట్‌ బజార్‌లను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఏదీ ఇచ్చినా, ఇవ్వకపోయినాసామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టబోనని, బీఆర్‌ఎస్‌ హాయంలో భార్యాభర్తలు మాట్లాడుకున్నా ట్యాప్‌ చేసేవారని, వేధింపులకు గురి చేశారని అన్నారు. ఎంజీబీఎస్-చంద్రాయణ్‌గుట్ట మెట్రోను రెండున్నరేళ్లలో పూర్తి చేసి రాజేంద్రనగర్‌ మీదుగా శంషాబాద్‌ విమానశ్రయానికి అనుసంధానిస్తామని హామీనిచ్చారు. మలక్‌పేటలో మహిళా కాలేజీ భవనం సిద్ధమైన తర్వాత దావత్‌కు వస్తామన్నారు.


గవర్నర్‌తో సీఎం రేవంత్‌ భేటీ

సభ అనంతరం ముఖ్యమంత్రి నేరుగా రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లా దగ్గరకు వెళ్లారు. కొండా సురేఖ బర్తర్‌ఫకు కారణాలను వివరించారు. ఏడో తేదీన ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల గురించి గవర్నర్‌కు చెప్పినట్లు తెలిసింది. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజహరుద్దీన్‌, రాజ్యసభ సభ్యుడు వేంనరేందర్‌రెడ్డి తదితరులున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళ సంఘాల సభ్యులకు ఈ కేవైసీ

2027 అక్టోబరు నుంచి భారత్‌ ఎన్‌క్యాప్ 2.0

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 04:43 AM