2027 అక్టోబరు నుంచి భారత్ ఎన్‌క్యాప్ 2.0
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:02 AM
వచ్చే ఏడాది (2027) అక్టోబరు నుంచి ‘భారత్ ఎన్‌క్యాప్ 2.0’ను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
వచ్చే ఏడాది (2027) అక్టోబరు నుంచి ‘భారత్ ఎన్‌క్యాప్ 2.0’ను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వాహనాల పూర్తి భద్రత విధానాన్ని (ప్రమాద నిరోధకం నుంచి పోస్ట్ యాక్సిడెంట్ కేర్ వరకు) అంచనా వేయడంతో పాటు దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇది దోహదపడనుందన్నారు. ప్యాసింజర్ వాహనాల్లో భద్రత ప్రమాణాలను పరీక్షించి, తదనుగుణంగా వాటికి 1 నుంచి 5 స్టార్ రేటింగ్ కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌క్యాప్) వ్యవస్థను 2013లో అమల్లోకి తెచ్చింది. ప్రమాద సమయంలో వాహనం పెద్దలు, పిల్లల్ని ఎంతగా రక్షించగలదనే అంశాలతో పాటు వాహనంలోని భద్రత ఫీచర్లను పరిశీలించి రేటింగ్ కేటాయిస్తుంది.
బీఎస్-4 వాహనాల కాలుష్య నియంత్రణకు కొత్త పరికరం: బీఎస్-4 వాహనాల నుంచి కాలుష్యం తగ్గించేందుకు కొత్త పథకాన్ని త్వరలో ప్రకటించబోతున్నట్లు గడ్కరీ తెలిపారు. ఈ పథకంలో భాగంగా బీఎస్-4 వాహనాల్లో పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం), నైట్రోజన్ ఆక్సైడ్ (ఎన్‌ఓఎక్స్)ను గణనీయంగా తగ్గించేందుకు రేర్ ఎమిషన్ కంట్రోల్ పరికరాన్ని బిగిస్తారు. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన ఈ పరికరం ఖరీదు రూ.4,000 -5,000 స్థాయిలో ఉండవచ్చన్నారు. ఈ పరికరం బిగింపుతో బీఎస్ 4 నుంచి కాలుష్య ఉద్గారం బీఎస్ 6 వాహన స్థాయికి తగ్గుతుందని మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాలుగో రోజూ నష్టాలే..
పాత కంప్యూటర్ల కోసం జియోపీసీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News